Praja Kshetram
తెలంగాణ

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మోసం.

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మోసం.

 

– రూ.2 కోట్లకు పైగా కొల్లగొట్టిన నెల్లూరు జంట అరెస్ట్

– రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో భారీ మోసం

– అధిక లాభాల ఆశ చూపి రూ.2.11 కోట్లు వసూలు

– నెల్లూరుకు చెందిన భార్యాభర్తలు పనేమ్ సురేశ్, ఉజ్వల అరెస్ట్

– హైదరాబాద్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు

– అగర్‌వుడ్‌ ఫార్మ్‌ల్యాండ్‌, క్రిస్ట్‌ ప్రాపర్టీస్‌ పేర్లతో స్కామ్

– సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసుల దర్యాప్తు

హైదరాబాద్ జులై 03(ప్రజాక్షేత్రం):రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన దంపతులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన పనేమ్ సురేశ్, పనేమ్ ఉజ్వల భార్యాభర్తలు ఈ మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. నిందితులు మెసర్స్‌ క్రిస్ట్‌ ప్రాపర్టీస్‌, అగర్‌వుడ్‌ ఫార్మ్‌ల్యాండ్‌ వంటి పేర్లతో కంపెనీలను సృష్టించారు. రియల్ ఎస్టేట్ వెంచర్లలో పెట్టుబడి పెడితే తక్కువ కాలంలోనే భారీ లాభాలు పొందవచ్చని పలువురిని నమ్మించారు. వీరి మాటలు నమ్మిన బాధితుల నుంచి సుమారు రూ.2.11 కోట్లు వసూలు చేసి మోసం చేశారు. డబ్బులు చెల్లించిన తర్వాత ఎంతకూ లాభాలు రాకపోగా, అసలు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ దంపతులపై సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాచుపల్లి, కొల్లూరు, చందానగర్‌, మాదాపూర్‌ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేశారు.

Related posts