మళ్లీ కనిపించిన చిరుత పులి
గండిపేట జులై 24(ప్రజాక్షేత్రం):చిరుతపులి మళ్లీ కనిపించింది. గురువారం ఉదయం నార్సింగి మున్సిపల్ పరిధిలోని వ్యాస్ నగర్ లో ఓ రోడ్డు దాటుతుండగా ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో దృశ్యాలు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా గురువారం చీకటి పడుతుండగా మంచిరేవుల ఈఐపీఎల్ రేవరేజ్ విల్లాస్ పక్కన రిలయన్స్ సంస్థకు కేటాయించిన 100 ఎకరాల భూమిలోని ఓ కొండపై కనిపించినట్లు విల్లాస్ లో నివాసం ఉంటున్న వారు తెలియజేశారు. విల్లా నంబర్ 51 లో నివాసం ఉంటున్న వారు టెర్రస్ పైనుంచి కొండపై ఉన్న చిరుత పులి దృశ్యాలను చిత్రీకరించారు. చిరుత పులి ఉన్న విషయం ధ్రువీకరణ కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఫారెస్ట్ అధికారులు సత్వరమే చిరుతను బంధించాల్సి ఉందని విజ్ఞప్తి చేస్తున్నారు. చిరుత పులిని బంధించేందుకు ఫారెస్ట్ అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 8 సీసీ కెమెరాలతో పాటు రెండు బోన్లను ఏర్పాటు చేశారు. బోనులో ఎరగా వీధి కుక్కలను ఉంచారు. చిరుతను బంధించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు.