Praja Kshetram
సంపాదకీయం

42శాతం రిజర్వేషన్ల పై సాట్ల తౌడు వోసి కుక్కలకు కొట్లాట వెట్టినట్టుంది-రేవంత్ రెడ్డి వైఖరీ?

42శాతం రిజర్వేషన్ల పై సాట్ల తౌడు వోసి కుక్కలకు కొట్లాట వెట్టినట్టుంది-రేవంత్ రెడ్డి వైఖరీ?

(9వ షెడ్యూల్ లో అడిక్వెట్ అనే పదాన్ని చేర్చి సమస్యను జటిలం చేశారు)

ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్ష చేయడం యావత్ భారత ప్రజానికామంత దృశ్య మాధ్యమాల్లో వీక్షించారు. ముఖ్యంగా తెలంగాణలో అయితే బీ.సీ మేధావుల మధ్య చర్చోప చర్చలు జరిగాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ లను బీ.సీ లకు కేటాయించాలని రాహుల్ గాంధీ చెప్పినట్టు అందుకే సమగ్ర కుటుంబ సర్వే, ఆర్థిక ,రాజకీయ, విద్యా ఉపాధి ,కల్పన రంగాలలో తెలంగాణలో జరిగింది. ఈ సర్వే ఆధారంగానే బీ.సీలు 56.30% ఉన్నారని తెలంగాణ ప్రభుత్వం నిర్ధారించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్డినెన్స్ తెస్తామని దాన్ని జీ.వో రూపంలో ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు. ఒకవేళ ఆర్డినెన్స్ తీసుకువచ్చిన 6 నెలల కాలం పాటే చెల్లుతుంది. ఎవరైనా ఆర్డినెన్స్ రూపంలో వచ్చిన జీ.వో మీద కోర్టుకు వెళితే కోర్టు కొట్టి పాడేస్తుంది. ఆర్డినెన్స్ ను నమ్ముకొని జీ.వో తీసుకువచ్చి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కనక ఇచ్చినట్లయితే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాయిదా పడతాయి. ఈ పరిస్థితిని గమనించిన రేవంత్ రెడ్డి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మూడు రోజులపాటు ధర్నాకు ఉపక్రమించాడు. ఇందులో రేవంత్ రెడ్డి చాణక్య నీతి ఉంది. 2025 మార్చి నెలలో శాసనసభ సాక్షిగా 42 శాతం రిజర్వేషన్స్ బిల్లును ఆమోదించుకొని గవర్నర్ కు అందజేశాడు. గవర్నర్ భారత రాష్ట్రపతికి అందజేశారు. ప్రస్తుతం వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును కేంద్రంలో ఉన్న బి.జె.పి ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టలేదు. సమస్య మరియు చిక్కంతా ఇక్కడే వచ్చి పడింది. నేను 42% రిజర్వేషన్స్ ఇస్తానంటే బి.జె.పి ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. ఆర్డినెన్స్ అమలు చేస్తే

కోర్టులు కొట్టివేస్తున్నాయని అమాయక బీ. సీ

జనాలను నమ్మించి పాత విధానంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

ఇదే రేవంత్ రెడ్డి యొక్క ఎత్తుగడ. అతని చాణిక్య నీతి కి అద్దం పడుతుంది. అయితే ఈ వ్యాసంలో నేను బీ.సీల కు 42 శాతం రిజర్వేషన్స్ సాధ్యా సాధ్యల పైన విపులంగా వివరిస్తున్నాను. పాఠకులైన మీరంతా దీన్ని చదివి బీ. సి

లను రేవంత్ రెడ్డి ఎలా మోసగిస్తున్నాడో? అనే విషయం పట్ల చైతన్యం చేస్తారని ఆశిస్తున్నాను.

 

 

 

రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ ద్వారా మాత్రమే బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలవుతాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్స్ తీసుకురావడం కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కాదు. విద్యా, ఉద్యోగ, ఉపాధి, అవకాశాల కోసం కూడా అనే విషయాన్ని విస్పష్టంగా చెప్పుతుంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర హైకోర్టు మూడు నెలలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి తీరాలని తేల్చి చెప్పింది. స్థానిక సంస్థలు అన్నవి 73, 74 వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగపరమైన సంస్థలు గా మారాయి. అంతవరకు ఇవి రాజ్యాంగ బద్ద సంస్థలు కావు. పంచాయతీలు గానీ, మున్సిపాలిటీలు గాని 73, 74 వ రాజ్యాంగ సవరణను 1992 సంవత్సరం లో చేయడం ద్వారా రాజ్యాంగ బద్ద సంస్థలుగా ఆవిర్భవించాయి. అప్పుడే రాజ్యాంగంలో ఆర్టికల్ 243 (డి) ని చేర్చడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీల కోసం 243 (3) ని చేర్చడం కూడా జరిగింది. 243(డి 1)లో ఎస్సీ ,ఎస్టీలకు, జనాభా ధమాషా ప్రకారం స్థానిక సంస్థలలో సీట్లు కేటాయించాలని ఉంది. 1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండి 1992వ సంవత్సరం వరకు కూడా పంచాయితీలలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కేటాయించలేదు. కానీ చట్టసభల్లో మాత్రం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. 1992వ సంవత్సరంలోనే 73, 74 వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు ఎస్సీ, ఎస్టీల జనాభా దమాషా ప్రకారంగా రిజర్వేషన్లు కేటాయించారు. 243(డి 6) (డి 1) లలో ఎస్సీ, ఎస్టీలకు ఈ రిజర్వేషన్లను కేటాయించారు. 243 (డి 2) లో 1/3 వ వంతు, రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీలకు కేటాయించారు. 243(డి 6) లో రాష్ట్రాల ప్రభుత్వాలు బీ.సీలకు ఏది కరెక్ట్ అనిపిస్తే దాని ప్రకారం రిజర్వేషన్స్ కల్పించాలి అని చెబుతుంది. దీన్నే న్యాయ శాస్త్ర పరిభాషలో అడిక్వేట్ అని అంటారు. ఈ పదాన్ని 9వ షెడ్యూల్ లో చేర్చడం వల్లనే బీ.సీలకు పెద్ద నష్టం జరిగింది. దీని అర్థం ఏమిటంటే ఏది కరెక్ట్ అనిపిస్తే అది అని లేదా తగినంత అని అర్థం. 9వ షెడ్యూల్ లో జనాభా దమాషా ప్రకారము అని చెప్పి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇదే తెలంగాణ ప్రభుత్వం సర్వే చేసి 56.30 శాతం తెలంగాణలో బీ.సీలు ఉన్నారు అని చెప్పింది. ఈ అడిక్వెట్ అనే పదాన్ని చేర్చి తగినంత అంటే ఎంత మేరకు తగినంత అనే నిర్వచనాన్ని స్పష్టంగా ఇవ్వలేదు. 1994లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొదటి సారిగా 73, 74 వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీ ,బీ.సీ,లకు సీట్లను కేటాయించారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరపాలి. వాటికి కూడా నిధులు, విధులు కేటాయించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పంచాయతీరాజ్ చట్టాన్ని 1994లో రూపొందించింది. అప్పుడు ఈ అడిక్వెట్ అనే పదం ఆధారంగా బీ.సీలకు 34 శాతం రిజర్వేషన్లను కేటాయించారు. 1994వ సంవత్సరం లో జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా 34 శాతం రిజర్వేషన్లను బీ.సీలకు కేటాయించారు. ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో 34% రిజర్వేషన్లను బీ.సీలకు కేటాయించారు. 2010వ సంవత్సరంలో కర్ణాటక కు చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో కేస్ వేశాడు. భారత రాజ్యాంగం ఇంద్ర సహానీ కేస్ లో 50% వరకు మాత్రమే రిజర్వేషన్ లను ఇవ్వాలని ఉంది. ఈ 50% రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా కేటాయించాలి. అంతకుముందే బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేస్ లో 50% రిజర్వేషన్స్ ఇచ్చారు. ఈ కేస్ ను 1961లో రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. 1961 లో ఈ కేస్ ఆధారంగా 50% రిజర్వేషన్లను రాజ్యాంగంలో చేర్చారు. అప్పటి సుప్రీంకోర్టు జడ్జి, జస్టిస్. బాలకృష్ణ మరియు అప్పటి రాజ్యాంగ ధర్మాసనం 2010వ సంవత్సరంలో మూడు సూత్రాలు అనే రిపోర్టేషన్ పెట్టారు. మొట్టమొదటి సారిగా బీ.సీలు అయినవారు రాజ్యాధికారంలో వెనుకబడ్డారని నిర్ధారించారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 15(4) ప్రకారం సామాజిక, విద్యారంగంలో, రాజకీయ రంగంలో వెనుకబడిన వారు అని అర్థం. ఈ రిపోర్టేషన్ అనే పదాన్ని 243(డి 6)లో వాడలేదు. బీ.సీలు ఉన్నారు. కానీ ఏ వర్గానికి చెందిన బీ.సీలు అనేది సరిగా నిర్ధారించలేదు. దీనివల్ల రాజకీయంగా వెనుకబడిన తరగతులకు సంబంధం లేదని జడ్జిమెంట్ ఇచ్చారు. రాజకీయంగా వెనకబడిన కులాలకు ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఏంపరీకాల్ డాటా మరియు కాంటెంపరరీ డాటా సేకరించి బీ.సీలకు ఎంత శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలి. ఒకవేళ ఇచ్చిన 50% రిజర్వేషన్లకు లోబడి ఇవ్వాలి. ఎస్సీ, ఎస్టీ,లకు జనాభా దమాషా ప్రకారం ఇస్తూ 50% లోపు ఎంత రిజర్వేషన్స్ ఇవ్వాలి అనే విషయాన్ని నిర్ధారించారు. మన రాష్ట్రంలో ప్రస్తుతం ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 10 శాతం ఉంది. 50% లో 28% పోతే కేవలం 22 శాతం బీ.సీలకు రిజర్వేషన్స్ ఇవ్వాలి. ఇదే విషయాన్ని వికాస్ రావు దావోల్కర్ కేస్ లో సుప్రీంకోర్టు ఒక తీర్పును ఇచ్చింది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు 2012 వ సంవత్సరంలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు హైకోర్టు మరియు సుప్రీంకోర్టు రెండు కూడా ముందే ఈ సమస్యను లేవనెత్తాయి. అదే సమయంలో సుప్రీంకోర్టు కలగజేసుకొని ఇప్పటికిప్పుడు బీ.సీల లెక్కలు సేకరించడం ఇబ్బంది, మరియు కష్టం కాబట్టి ఈ ఒక్కసారి కి పాత విధానంలోనే ఎన్నికలను జరుపుకోండి అని కోర్టు తీర్పు ఇచ్చింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 2018లో కొత్త పంచాయతీరాజ్ చట్టం వచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 9,12,16, 17 లాంటి నాలుగు బలమైన సెక్షన్ల ను ఉపయోగించి 34 శాతం రిజర్వేషన్లను బీ.సీలకు కేటాయించాడు. దీన్ని అమలు పరచడం కోసం జీ.వో నంబర్ 396 ను తీసుకొచ్చాడు. ఈ జీ.వో పై స్వప్న రెడ్డి అనే అమ్మాయితో హైకోర్టులో కేస్ వేయించి ఛాలెంజ్ చేశారు. తెలంగాణ హైకోర్టు కలగాచేసుకొని కృష్ణమూర్తి జడ్జిమెంట్ ప్రకారం ఇది చెల్లదు. సుప్రీంకోర్టు కూడా అదే తేల్చి చెప్పేసింది. అని హైకోర్టు చెప్పింది. పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు దీన్ని కొట్టి వేసింది. ఇంతటితో రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు తలుపు తట్టింది.

 

వెంటనే సుప్రీంకోర్టు మీరు వేసిన పిటిషన్ ను ఉపహాసంహరించుకోండి. అప్పిల్ చేసే అర్హత మీకు లేదు అని తేల్చి చెప్పేసింది. 2018 డిసెంబర్ లో ఆర్డినెన్స్ _ 2 అని ఇచ్చి ఈ ఆర్డినెన్స్ ద్వారా 2019 ఫిబ్రవరి, మార్చి నెలలో ఎన్నికలను జరిపింది. ఈ ఆర్డినెన్స్ కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే దీన్ని చట్టంలోకి తీసుకురావాలి. కాబట్టి యాక్ట్ నెంబర్ 4/ 2019 యాక్ట్ కు 285/A అని పేరు పెట్టారు. ఈ 285 /A లో ఏం చెప్పారంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దృష్ట్యా ఎస్సీ, ఎస్టీలకు జనాభా ధమాషా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తూ బీ.సీలకు మాత్రం ఆ 50% రిజర్వేషన్లలో మిగిలినవి ఇస్తారు అని చెప్పారు. ప్రస్తుతం ఇప్పుడు ఏం చేస్తున్నారు. అంటే 285/A ను తీసివేసి మళ్లీ మేము జీ.వో ఇస్తాం . 42 శాతం రిజర్వేషన్స్ కోసం 285/A ను

తీసివేయడానికి ఆర్డినెన్స్ ఇస్తారు. ఈ ఆర్డినెన్స్ ను తీసివేసిన తర్వాత మళ్లీ మేము జీ.వో ఇచ్చి 42% రిజర్వేషన్లను బీ.సీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో అమలు జరుపుతాము అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంది. కానీ ఇది అసాధ్యం. ఇప్పటికే ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ఒకసారి కొట్టి వేసింది. కుల గణన సేకరణ తర్వాత కూడా 50% రిజర్వేషన్లకు లోబడే బీ.సీలకు రిజర్వేషన్స్ ఇవ్వమని కోర్టు చెప్పింది ఇది వాస్తవమైన విషయం. 2022 వ సంవత్సరంలో మళ్లీ వికాస్ రావు కేస్ లో దాన్ని సుప్రీం కోర్టు లో లేవనెత్తారు. కాబట్టి కోర్టు నిర్ణయమే తుది నిర్ణయం. ఇప్పుడు ఏం చేస్తే బీ.సీలకు 42% రిజర్వేషన్స్ దక్కుతాయి? అనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తర్జన భజన పడి మార్చి 2025లో శాసనసభ సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదింప చేసుకొని బీ.సీలకు విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ ,స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్స్ ఇచ్చే బిల్లు గా గవర్నర్ చేత కూడా ఆమోదింపజేసుకొని కేంద్ర ప్రభుత్వానికి పంపి పార్లమెంట్ లోక్ సభలలో చర్చ జరిపి 9వ షెడ్యూల్లో పెట్టించాలని రాష్ట్ర ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తుంది. ఈ సుదీర్ఘ ప్రక్రియ మొత్తం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు లోబడే జరిగింది. ఇట్టి బిల్లును రాష్ట్రపతి దగ్గరకు మార్చి చివర లో పంపారు. ప్రస్తుతం నాలుగు నెలల సమయం గడిచిపోయింది. ఈ బిల్లును రాష్ట్రపతి దగ్గరకు పంపిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి చర్యలను పెద్దగా చేపట్టలేదు. ఏప్రిల్ 2 న మాత్రం ధర్నా జరిగింది. ఆ ధర్నాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వచ్చాడు. ఆ తర్వాత ఒక అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ఆ అఖిలపక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరకు తీసుకెళ్లడం గాని, ఇప్పటివరకు కేంద్ర కేబినెట్ మంత్రులను కలవడం కానీ, రాష్ట్రపతిని కలవడం కానీ చెయ్యలేదు. అంతెందుకు ప్రభుత్వం నుండి ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలను కూడా జరపలేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి 42 శాతం రిజర్వేషన్లను బీ.సీలకు ఇచ్చే చిత్తశుద్ధి లేదు అని. 9 వ షెడ్యూల్ గురించి మాట్లాడాలి అంటే చాలా విషయాలు ఉన్నాయి. తమిళనాడులో 69% రిజర్వేషన్స్ ఉన్నాయి. అందులో బీ.సీల వాటా 50 శాతం ఉంది. ఎస్సీలకు 18 శాతం ఎస్టీలకు ఒక శాతం ఉంది మొత్తం 69% రిజర్వేషన్స్ ను తమిళనాడు ప్రభుత్వం అక్కడి ప్రజలకు కల్పించింది. భారతదేశంలో ఇంద్రసహానీ జడ్జిమెంట్ స్పష్టంగా 50% వాటా వద్దని చెప్పినా కూడా వాళ్లు అక్కడ చట్టం చేసుకుని పార్లమెంటులో ఆమోదించుకొని 9 వ షెడ్యూల్ లో పెట్టుకున్నారు. ఇదంతా 1994 లోనే జరిగింది. 9వ షెడ్యూల్ లో చేర్చినంత మాత్రాన దానికి రక్షణ ఉండదా? అన్న ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది. 9వ షెడ్యూల్ ని కూడా రివ్యూ చేస్తామని 2009లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. 1973లో కేశవానంద భారతి కేస్ తర్వాత ఏ అంశానికి సంబంధించిన రిజర్వేషన్ల నైనా 9 వ షెడ్యూల్ లో చేర్చితే రాజ్యాంగపు మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ఉంటే కొట్టివేస్తామని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ 9వ షెడ్యూల్ లో 284 చట్టాలను పెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఈ , డబ్ల్యూ, ఎస్ రిజర్వేషన్స్ ను జనహిత వర్సెస్ ఈనాడు ఇండియా కేసులో 10% రిజర్వేషన్స్ ను రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధం అని సమస్యను లేవనెత్తిన. కానీ ఇక్కడ రాజ్యాంగ మౌలిక సూత్రాలు రిజర్వేషన్లకు వ్యతిరేకం కావు అని చెప్పారు. ఈ

డబ్ల్యూ.ఎస్ రిజర్వేషన్లను తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టి 10% రిజర్వేషన్స్ హుటాహుటిన కల్పించారు. తొమ్మిదవ షెడ్యూల్ లో ఉన్న 284 చట్టాలపై ఇప్పటివరకు సుప్రీంకోర్టు ఏ ఒక్క చట్టాన్ని ముట్టుకోలేదు మరియు కొట్టివేయలేదు. ఇప్పటికిప్పుడు 42% రిజర్వేషన్స్ 9

వ షెడ్యూల్ లో చేర్చాలి అంటే ఎలా? మరి తమిళనాడు రాష్ట్రానికి 69 శాతం రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు ఇతర రాష్ట్రాల నిర్ణయాలను పరిగణలోకి తీసుకోలేదు. ఈ, డబ్ల్యూ ,ఎస్ రిజర్వేషన్స్ ను కేంద్ర ప్రభుత్వం కేవలం వారం రోజుల్లోనే ఇచ్చింది. జనవరి 7న క్యాబినెట్ నిర్ణయం, జనవరి 8న లోక్ సభలో పాస్, జనవరి 9న రాజ్యసభలో పాస్, జనవరి 12వ తారీఖున రాష్ట్రపతి ఆమోదం, జనవరి 14న గెజిట్ నోటిఫికేషన్ అదే జనవరి 14 నుండి దేశవ్యాప్తంగా అమలు చేయడం జరిగింది. 9 వ షెడ్యూల్ అనేది రిజర్వేషన్స్ కు రక్షణ కవచం లాంటిది. అయితే ఇంత జరుగుతున్నా దీని వెనకాల ఇంత తతంగం ఉన్న కూడా 42 శాతం రిజర్వేషన్స్ పైన రాష్ట్ర ప్రభుత్వం అస్పష్టంగానే నిర్ణయాలు తీసుకుంటుంది. బిల్లులో కేవలం ఈ రిజర్వేషన్స్ స్థానిక సంస్థలకి మాత్రమేనా? లేక విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనల లో కూడా 42 శాతం రిజర్వేషన్స్ ఇస్తారా? అన్న అంశం పైన రాష్ట్ర ప్రభుత్వమే స్పష్టత ఇవ్వడం లేదు. ప్రభుత్వం యొక్క ఎత్తుగడ కేవలం స్థానిక సంస్థల ఎన్నికలను మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఈ బిల్లును తెస్తున్నట్టుగా ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఉన్న బీ.సీల పట్ల ఈ బిల్లు విషయంలో ఎలాంటి వైఖరిని ప్రదర్శిస్తుంది. భారతీయ జనతా పార్టీ పై నమ్మకంతో రాష్ట్రం నుండి 8 మంది ఎం.పీలను పంపించారు తెలంగాణ వాసులు. ఈ బిల్లు విషయంలో భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే అయిపోతుంది. అయితే క్రెడిట్ అంతా రేవంత్ రెడ్డికి వస్తుందని వెనకడుగు వేస్తుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదించిన, పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజానీకం కూడా 42% రిజర్వేషన్స్ ను ఆశిస్తారు. కేంద్ర ప్రభుత్వంతో నారా చంద్రబాబు నాయుడు అలయన్స్ ఉన్నాడు కాబట్టి ఈ సమస్యను ఆయన చిటికల్లో పరిష్కరించుకోగలడు. విశ్వాసనీయ సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి గారు ఆర్డినెన్స్ ను మరియు ఎన్నికల నోటిఫికేషన్ ఒకేసారి విడుదల చేసే అవకాశం ఉంది. అలా జరిగినట్లయితే 2018లో మహారాష్ట్రలో జరిగిన సంఘటన తిరిగి పురావృతమవుతుంది. ఆర్డినెన్స్ పై మహారాష్ట్ర ప్రజలు కోర్టుకు వెళ్లారు. జీ.వో రద్దయింది. ఎన్నికలు కూడా రద్దయ్యాయి. దాదాపు 4వేల గ్రామాల్లో బీ.సీల కు దక్కాల్సిన రిజర్వేషన్ దక్కకుండా బీ.సీలకు మొండి చేయి చూపుతో రిజర్వేషన్స్ లేకుండానే ఓపెన్ కేటగిరిలో అక్కడి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది.

(ఇంక ఉంది)

డా.జి. భాస్కర్ యాదవ్

ప్రొఫెసర్. ఉస్మానియా విశ్వవిద్యాలయం. హైదరాబాద్.

Related posts