లైంగిక సమ్మతికి 18 ఏళ్లు తప్పనిసరి అంతకంటే తగ్గిస్తే చాలా ప్రమాదకరం: కేంద్రం
– లైంగిక సమ్మతికి 18 ఏళ్లు తప్పనిసరి
– లేకుంటే బాలలపై నేరాలు, అక్రమ రవాణా పెరిగే అవకాశం
– సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
ఢిల్లీ ఆగస్టు 08(ప్రజాక్షేత్రం):లైంగిక చర్యకు సమ్మతి తెలపడానికి 18 ఏళ్లు దాటినవారే అర్హులన్న నియమాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించింది. లైంగిక సమ్మతి వయోపరిమితిని 18 నుంచి 16 సంవత్సరాలకు తగ్గించాలంటూ సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ చేసిన వాదనను కేంద్రం తోసిపుచ్చింది. మైనారిటీ తీరని బాలబాలికలను లైంగిక మోసాలు, దోపిడీల నుంచి కాపాడేందుకు ఈ విధానాన్ని ఉద్దేశపూర్వకంగా, బాగా ఆలోచించి అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
అది చాలా ప్రమాదకరం
యువతీ యువకుల మధ్య శృంగార భరిత ప్రేమ పేరుతో ఈ వయోపరిమితిని, తగ్గించడం లేదా సవరించడం చట్టవ్యతిరేకమేకాక, చాలా ప్రమాదకరం అని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటి లిఖిత పూర్వకంగా సుప్రీంకోర్టుకు తెలియజేశారు. పిల్లల మౌనాన్ని, భావోద్వేగాలను ఆసరాగా చేసుకొని లైంగిక దురాగతాలకు పాల్పడే వారిని ఈ పరిమితి కట్టడి చేస్తుందని ఆమె అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. లైంగిక సమ్మతి వయోపరిమితిని తగ్గిస్తే అదే సాకుగా పిల్లల అక్రమ రవాణా, బాలలపై జరిగే నేరాలు అడ్డూ, అదుపూ లేకుండా పెరిగిపోతాయని ప్రభుత్వం పేర్కొంది.
ఇంతకీ ఏమిటీ కేసు
పోక్సో చట్టం కింద లైంగిక కార్యకలాపాలకు సమ్మతి తెలిపే వయసును 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ విజ్ఞప్తి చేశారు. పోక్సో చట్టం 2012, ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం 16-18 ఏళ్ల వయసులో ఉన్నవారి లైంగిక కార్యకలాపాలను పూర్తిగా నేరంగా పరిగణించడాన్ని సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ప్రస్తుత చట్టం కౌమారదశలో ఉన్నవారి మధ్య ఏకాభిప్రాయ ప్రేమ సంబంధాలను నేరంగా పరిగణిస్తుందని, ఇది వారి రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తుందని అభిప్రాయపడ్డారు.
“పోక్సో చట్టం కౌమారదశలో ఉన్నవారి మధ్య ఏకాభిప్రాయ సంబంధాలను తప్పుగా చూపిస్తోంది. వారి స్వయంప్రతిపత్తి, పరిపక్వత, సమ్మతిని విస్మరిస్తుంది. 16- 18 సంవత్సరాలకు సమ్మతి వయసును పెంచడాన్ని సమర్థించడానికి ఎటువంటి హేతుబద్ధమైన కారణం లేదా అనుభావిక డేటా లేదు. చర్చ జరగకుండానే సెక్స్ సమ్మతి వయసును 18ఏళ్లకు పెంచారు. లైంగిక కార్యకలాపాల సమ్మతి వయసు 16ఏళ్లని జస్టిస్ వర్మ కమిటీ చేసిన సిఫార్సుకు ఇది విరుద్ధంగా ఉంది. ప్రస్తుతం కౌమారదశలో ఉన్నవారు ముందుగానే యుక్తవయస్సును పొందుతారు. వారు తమకు నచ్చిన ప్రేమ, లైంగిక సంబంధాలను ఏర్పరచుకోగలరు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నుంచి వచ్చిన ఫలితాలతో సహా శాస్త్రీయ, సామాజిక డేటా టీనేజర్లలో లైంగిక కార్యకలాపాలు అసాధారణం కాదని సూచిస్తున్నాయి. 2017- 2021 మధ్య 16-18 ఏళ్ల వయసు గల మైనర్లపై పోక్సో కేసులు 180 శాతం పెరిగాయి.”
– ఇందిరా జైసింగ్
లైంగిక కార్యకలాపాలకు అంగీకారం తెలిపే వయసు 18 ఏళ్లు
పోక్సో చట్టం ప్రకారం, ఇద్దరు వ్యక్తుల మధ్య లైంగిక సంబంధం విషయంలో సమ్మతి వయసుపై కొన్నాళ్ల క్రితం లా కమిషన్ కీలక వ్యాఖ్యలు చేసింది. లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి అంగీకారం తెలిపే కనీస వయసు 18 సంవత్సరాల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలనే వాదనను తిరస్కరించింది. పోక్సో చట్టం ప్రకారం ప్రస్తుతమున్న సమ్మతి వయసును మార్చడం అంత మంచిది కాదని పేర్కొంది.
