Praja Kshetram
ఆంధ్రప్రదేశ్

విశాఖ,జోన్ 2, 3లలో నాలుగు అక్రమ అంతస్తుల నిర్మాణాలు

విశాఖ,జోన్ 2, 3లలో నాలుగు అక్రమ అంతస్తుల నిర్మాణాలు

 

– టౌన్ ప్లానింగ్ అధికారులపై తీవ్ర ఆరోపణలు – స్థానికుల బహిరంగ సవాల్

విశాఖపట్నం, ఆగస్టు 13(ప్రజాక్షేత్రం):విశాఖ నగరంలో బిల్డర్ మణికంఠ ఆగడాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నగరంలోని జీవీఎంసీ జోన్ 2, జోన్ 3 పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నాలుగు అక్రమ అంతస్తుల నిర్మాణాలు కొనసాగుతున్నాయని స్థానికులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఈ అక్రమాలపై టౌన్ ప్లానింగ్ ఏసీపీలు, టీపీవోలు, WPRSలు పర్యవేక్షణలో నిర్లక్ష్యం, అవినీతి కారణమని మండిపడుతున్నారు.

– జోన్ 2లో 3 అడుగుల రోడ్డులో భవనం

జోన్ 2 పరిధిలోని ఒక ప్రాంతంలో కేవలం 3 అడుగుల వెడల్పు రోడ్డులో రెండు అంతస్తుల భవనాన్ని నిర్మించడమే కాకుండా, జీవీఎంసీ అనుమతులు లేకుండా అదనపు అంతస్తులు కూడా నిర్మించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆటో కూడా సులభంగా దూరలేని ఇరుకైన సందులో ఈ నిర్మాణం జరుగుతుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిల్డర్ మణికంఠ, స్థానిక ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ పేరును దుర్వినియోగం చేస్తూ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో జోన్ 2 టౌన్ ప్లానింగ్ సిబ్బంది, WPRS రాజు బిల్డర్‌కు సహకరిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.

– జోన్ 3లో కెఆర్ఎమ్ కాలనీలో అక్రమ నిర్మాణాలు

ఇదే బిల్డర్ జీవీఎంసీ జోన్ 3 పరిధిలోని కెఆర్ఎమ్ కాలనీలో కూడా అనుమతులు లేకుండా రెండు అపార్ట్‌మెంట్లు నిర్మించడమే కాకుండా అదనపు అంతస్తులు జోడించారని పలు ఫిర్యాదులు వెలువడ్డాయి. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం, WPRSలకు ఇచ్చిన ఫిర్యాదులు చర్యలు తీసుకోకుండానే మూసివేస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇక్కడ కూడా జోన్ 3 టౌన్ ప్లానింగ్ ఏసీపీ మధుసూదన్ సహా సంబంధిత అధికారులు ఈ అక్రమాలను కళ్లుమూసి చూస్తున్నారని ఆరోపిస్తున్నారు.

– ప్రజల బహిరంగ సవాల్

జోన్ 2, 3 టౌన్ పరిధిలో ప్లానింగ్ ఏసీపీలు, టీపీవోలు, WPRSలు ఈ నాలుగు అక్రమ అంతస్తుల నిర్మాణాలపై బహిరంగ విచారణకు సిద్ధమా అని స్థానికులు సవాల్ విసిరారు. ఈ అవినీతి బాగోతంపై పలువురు ఛీదరించుకుంటున్నారు.

– WPRS రాజు స్పందన

ఈ ఆరోపణలపై స్పందించిన WPRS రాజు, “అవన్నీ అనధికార అంతస్తులే” అని అంగీకరించినట్లు సమాచారం. పై అధికారులు ఏ ఆదేశాలు ఇస్తే వాటిని అమలు చేస్తానని చెప్పారు.

– స్థానికుల డిమాండ్

ఈ అక్రమాలకు పాల్పడిన బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను కూల్చివేయాలని, నగరంలో అక్రమ నిర్మాణాలను అరికట్టే కఠిన చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Related posts