Praja Kshetram
క్రైమ్ న్యూస్

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ, కానిస్టేబుల్

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ, కానిస్టేబుల్

మహబూబాబాద్ ఆగస్టు 23(ప్రజాక్షేత్రం):అవినీతి అధికారులు మారడం లేదు. ప్రజలను లంచాల పేరిట వేధిస్తూనే ఉన్నారు. నిత్యం ఏసీబీ దాడులు చేపడుతున్నా లంచాలకు మరిగిన అధికారులు భయపడటం లేదు. తాజాగా లంచం తీసుకుంటూ సీఐ, కానిస్టేబుల్ రెడ్​ హ్యాండెడ్​గా దొరికారు. మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ పోలీస్​ స్టేషన్​లో భూక్యా రాజేష్​ సీఐగా పని చేస్తున్నాడు. ఇటీవల నమోదైన ఓ కేసులో ఆయన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆ వాహనాన్ని విడుదల చేయడంతో పాటు, కేసులో సాయం చేయడానికి సీఐ రూ.50 వేల లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. ఈ మేరకు శనివారం బాధితుడి నుంచి సీఐ రాజేష్, అతని గన్​మెన్, పోలీస్ కానిస్టేబుల్ ధారావత్ రవి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్ట్​ చేశారు.

– లంచం అడిగితే ఫోన్​ చేయండి

ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్​ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్​ ఫ్రీ నంబర్​, వాట్సాప్ నంబర్​ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

Related posts