తైలం.. పైలమే..!
– చనిపోయాడని పడుకోబెట్టి దండలు వేసి రోధించిన కుటుంబీకులు.
– ఎదపై పచ్చబొట్టు పొడిపించుకున్న అభిమాని రాకతో కదలిక.
– ఆసుపత్రికి తరలించగా కోలుకున్న తైలం రమేష్.
వనపర్తి ప్రతినిధి సెప్టెంబర్ 01(ప్రజాక్షేత్రం):చనిపోయాడనుకున్న వ్యక్తి లేచి కూర్చున్న సంఘటన వనపర్తి జిల్లా కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. వనపర్తికి చెందిన తైలం రమేష్ తెలంగాణ ఉద్యమంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి పని చేశాడు. ఈ క్రమంలో నిరంజన్ రెడ్డికి వీరాభిమానిగా మారిన ఆయన తన ఎదపై నిరంజన్ రెడ్డి ఫోటో, పేరును పచ్చబొట్టుతో పొడిపించుకున్నాడు. జీవనోపాధి నిమిత్తం హైదరాబాదులో ఉండే రమేష్ వనపర్తి కి వచ్చి ఆదివారం ఉదయం అస్వస్థతకు గురయ్యాడు. ఉన్నట్టుండి ఉలుకు పలుకు లేకుండా పడి ఉండటంతో మరణించాడఅని కుటుంబీకులు భావించారు. రమేష్ చనిపోయాడని రోదనలు అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు కూడా చేశారు. ఇంటి గుమ్మంలో పడుకోబెట్టి పూలమాలలు వేశారు. రమేష్ చనిపోయాడని సమాచారం అందుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కడచూపు కోసం ఇంటికి వెళ్లి పూలమాల వేసేందుకు వంగడంతో రమేష్ శరీరంలో కదలిక ఉన్నట్లు గుర్తించారు. వెంటనే రమేష్.. రమేష్ అంటూ గట్టిగా పిలవడంతో మరింత కదిలాడు. దీంతో కుటుంబీకులు వెంటనే అతనికి తరలించగా మెరుగైన చికిత్స అనంతరం ఆయన కోలుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై అభిమానం నింపుకొని ఎదలో పచ్చబొట్టు పొడి పెంచుకోవడంతో సరిగ్గా అదే సమయానికి ఆయన రావడంతోటే చనిపోయాడు అనుకున్న వ్యక్తికి కదలిక రావడం బతికి బట్ట కట్టడం నిజమైన అభిమానానికి తార్కాణంగా చెప్పవచ్చు.
