నెలాఖరులో జూబ్లీహిల్స్ బైపోల్ నోటిఫికేషన్..!
– అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం..!!
తెలంగాణ బ్యూరో సెప్టెంబర్ 11(ప్రజాక్షేత్రం): ఈ నెలాఖరులో జూబ్లీహిల్స్ బైపోల్ నోటిఫికేషన్ విడుదల కానుందని, ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సంకేతాలు అందినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది.ఇప్పటికే తుది ఓటరు ముసాయిదా జాబితాను విడుదల చేసిన ఈసీ.. ఈనెల మూడో వారంలో ఫైనల్ ఓటరు లిస్టును రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తున్నది. ఆ తర్వాత ఏ క్షణమైన ఉపఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అయితే, దీపావళి తర్వాత పోలింగ్ జరిగే అవకాశం ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపినాథ్ మరణంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ సెగ్మెంట్‌లో విజయం కోసం అన్ని ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి.
– నవంబరు 7లోపు ఫలితం..
బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే జూబ్లీహిల్స్ బై పోల్ షెడ్యూలు విడుదల కానుంది. అక్కడ రెండు లేదా మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించే చాన్స్ ఉంది. సాధారణంగా ఉప ఎన్నికలను చివరి దశ పోలింగ్‌తో నిర్వహించే సంప్రదాయం కొనసాగుతున్నది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దీపావళి తర్వాత జరిగే అవకాశం ఉంటుదని చర్చ ఆఫీసర్లలో ఉంది. ఫలితం మాత్రం నవంబరు తొలి వారంలో ప్రకటించాల్సి ఉంటుంది. ఎందుకంటే బిహార్ అసెంబ్లీ నవంబరు 7 లోపు ఏర్పడాలి. అందుకని ఈసీ ఈలోపే పోలింగ్ పూర్తి చేసి రిజల్ట్ ప్రకటించేందుకు కావాల్సిన క్యాలండర్‌ను తయారు చేస్తున్నట్లు తెలిసింది. ‘ఉపఎన్నికల కోసం మేం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే ముసాయిదా ఓటరు లిస్టును రిలీజ్ చేశాం. ఈనెల 23 తర్వాత ఫైనల్ ఓటరు లిస్టు ప్రకటిస్తాం. అనంతరం ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయొచ్చు’ అని ఎన్నికల సంఘంలోని ఓ సీనియర్ ఆఫీసరు వెల్లడించారు.
