ఆరోగ్యానికి ముప్పుగా మారిన వరదనీరు – తక్షణ చర్యలు కోరుతున్న కాలనీవాసులు
కాప్రా సెప్టెంబర్ 19(ప్రజాక్షేత్రం):చర్లపల్లి విభాగ పరిధిలోని సాయి నగర్, కృష్ణారెడ్డి కాలనీ, బంజారా కాలనీ, నాగార్జున నగర్ మొదటి లైన్, శివసాయి నగర్, మీనాక్షి నగర్, లక్ష్మీనరసింహ కాలనీ, సోనియా గాంధీ నగర్ రెండో లైన్, మధుర నగర్ వంటి అనేక కాలనీల ప్రజలు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. నివాసితులు మాట్లాడుతూ, వరదనీరు, పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ ముక్కలు, సీసాలు, గాజు గుండ్లు, బంకమట్టి రాళ్ళు, ఇసుక కుప్పలు వీధులు, సందుల్లో నిల్వ ఉండటంతో జీవన పరిస్థితులు దుర్భరంగా మారాయని తెలిపారు. నిలిచిపోయిన నీరు, అపరిశుభ్రమైన వాతావరణం పిల్లలు, వృద్ధులకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. చర్లపల్లి కాలనీ సమాఖ్య సంఘం తరఫున పురపాలక సంస్థ మరియు నీటిపారుదల శాఖ, ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని వరదనీరు తొలగించి, పేరుకుపోయిన చెత్తను తొలగించే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇకపై ఇలాంటి వరదలు పునరావృతం కాకుండా సహాయక చర్యలను వేగవంతం చేసి, దీర్ఘకాలిక పరిష్కారాలు తీసుకురావాలని వారు కోరారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే తమ నిరసనను మరింత తీవ్రమం చేస్తామని హెచ్చరించారు.
