స్పాట్ గిఫ్ట్‌ల పేరుతో కాసం కుచ్చుటోపీ..
– లబోదిబోమంటున్న వినియోగదారులు
రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 21(ప్రజాక్షేత్రం):మాల్స్ అంటేనే వాటి యాజమాన్యం రూ.100 పెట్టుబడితో రూ.1000 సంపాదించడమనేది జగమెరిగిన సత్యం. అద్దాల మేడలో రంగురంగుల విద్యుత్ కాంతుల మధ్య నాసిరకం వస్తువులను పెట్టి నాణ్యమైనవిగా కొనుగోలుదారులకు అంటగట్టడం బహిరంగ రహస్యమే. ఇక పండగల సీజన్ వస్తే చాలు రకరకాల గిఫ్ట్ ఎరగా వేసి కస్టమర్లను పీల్చి పిప్పి చేస్తుంటారు. అలాగే జిల్లా కేంద్రంలో ఒక బట్టల షాపింగ్ మాల్ నయా మోసానికి తెర లేపింది. స్పాట్ గిఫ్టుల పేరుతో షాపింగ్ మాల్ యాజమాన్యం కస్టమర్లకు కుచ్చుటోపీ పెడుతున్నారు. తీరా మోసపోయామని తెలుసుకున్న కొనుగోలుదారులు లబోదిబోమంటూ షాపింగ్ మాల్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.
– కాసం స్పాట్ గిఫ్ట్ ల పేరుతో మోసం
రాష్ట్రంలో బతుకమ్మ, దసరా, దీపావళి పండుగ సందడి నెలకొంది. ఉన్నా లేకున్నా ప్రతి కుటుంబం పండగలప్పుడు కొత్త బట్టలు కొనుక్కోవడం మామూలే. దీనినే అదునుగా తీసుకొని బట్టల దుకాణాల వ్యాపారస్తులు కస్టమర్ల కొనుగోళ్లపై గిఫ్టులు ఇస్తామంటూ ఎర వేస్తారు. అందులో భాగంగానే జిల్లా కేంద్రంలో ఇటీవల నూతనంగా ప్రారంభమైన కాసం ఫ్యాషన్ షాపింగ్ మాల్ యాజమాన్యం కూడా నయా మోసానికి తెరలేపింది. ప్రతి 1,000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్ ఇస్తామని ప్రచారం చేసింది. షాపింగ్ మాల్ ముందు పెద్ద కమాన్ తో పాటు షాపింగ్ మాల్ వ్యాప్తంగా అక్కడక్కడ బోర్డులు కూడా ఏర్పాటు చేసింది. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఏదో ఒక గిఫ్ట్ వస్తుందని ఆశతో కొనుగోలుదారులు కాసం షాపింగ్ మాల్ వైపు క్యూ కట్టారు. అయితే కొనుగోలు చేసిన తర్వాత బిల్లు కట్టే సమయంలో అక్కడ సిబ్బంది చెప్పే విషయం విని కంగుతిన్నారు. స్పాట్ గిఫ్ట్ 2500 కొనుగోలుపై మాత్రమే ఇస్తున్నామని చెప్పడంతో వారు సిబ్బందిని నిలదీశారు. మాల్ సిబ్బంది నుంచి రెండు రకాల సమాధానాలు వస్తుండడంతో కస్టమర్లను గందరగోళం నెలకొంది. మాల్ లో పనిచేసే పై స్థాయి ఉద్యోగులను అడగగా గిఫ్టుల స్టాక్ అయిపోయిందని, పది రోజుల తర్వాత వచ్చి గిఫ్ట్ లు తీసుకోవాలని సూచించడంతో కొనుగోలుదారులు మోసపోయినట్టు గ్రహించారు. ఇలాంటి షాపింగ్ మాల్ పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వారి నుండి బలమైన వాదనలు వినిపిస్తున్నారు.
