పోలీసులపై రాళ్లు వేసిన యూపీ కార్మికులు
– పోలీస్ వాహనం, ఫ్యాక్టరీ అద్దాలు ధ్వంసం.
– హార్ట్ ఎటాక్ తో యూపీ కార్మికుడు మృతి
హుజూర్ నగర్ సెప్టెంబర్ 22(ప్రజాక్షేత్రం):సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని డెక్కన్ సిమెంట్ పరిశ్రమ వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికుడు మృతి చెందడంతో అతడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దీనిని అడ్డుకున్న పోలీసులను ఉరికించి కొట్టారు. పరిశ్రమ ఆఫీసు అద్దాలను ధ్వంసం చేశారు. రాళ్లు, కర్రలతో విరుచుకుపడి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పాలకవీడు ఎస్ఐ కోటేష్ మీడియాకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనీ బలియా జిల్లా కస్ కరూర్ తాలూకా కాకర్ ఘాట్ చెందిన వినోద్(45) అవాక్ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా వచ్చి సూర్యపేట జిల్లా పాలకవీడు మండలంలో ఉన్న డెక్కన్ ఫ్యాక్టరీలో వర్కర్‌గా పని చేస్తున్నాడు. అతడు ఫ్యాక్టరీ వెనుక భాగంలో ఉన్న లేబర్ కాలనీలో నివారం ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో తను ఉంటున్న కాలనీలో బట్టలు ఉతుకుతుండగా గుండెపోటు రావడం అక్కడ ఉన్నవారు వెంటనే ఆయనను గుర్తించి మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి అతను హార్ట్ ఎటాక్ తో చనిపోయాడని నిర్ధారించారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే మృతుడి కుటుంబానికి కంపెనీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ తోటి కార్మికులు సోమవారం ఉదయం డెక్కన్ ఫ్యాక్టరీ గేట్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో పరిశ్రమ అధికారులకు పాలకవీడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరకున్న పోలీసులు ధర్నాను ఆపాలని కోరారు. అంతేకాకుండా మీలో నలుగురు వస్తే ఫ్యాక్టరీ వాళ్లతో చర్చించి సమస్యను పరిష్కరిస్తాం అని ఎస్ఐ నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ కార్మికులు ఇవేమి వినకుండా పోలీసులపై మూకుమ్మడిగా రాళ్లతో దాడి చేశారు. రాళ్లు విసురుతూ, కర్రలతో తరుముతూ పోలీసులపై దాడి చేశారు. ఫ్యాక్టరీ సెక్యూరిటీ రూమ్ అద్దాలను పగలగొట్టారు. ఫ్యాక్టరీ ముందు పూల కుండీలను, చెట్లను ధ్వంసం చేశారు. పోలీసు వాహనం అద్దాలు ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో ఎస్ఐ కోటేష్‌తోపాటు కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలయ్యాయ. ప్రస్తుతం ఫ్యాక్టరీ అంతా పోలీస్ అదుపులో ఉంది. దాడి చేసిన వ్యక్తులను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు.
