Praja Kshetram
తెలంగాణ

పొంగిపొర్లుతున్న ప్రొద్దుటూరు వాగు – నిలిచిపోయిన రాకపోకలు

పొంగిపొర్లుతున్న ప్రొద్దుటూరు వాగు – నిలిచిపోయిన రాకపోకలు

 

శంకర్‌పల్లి సెప్టెంబర్ 26(ప్రజాక్షేత్రం):శంకర్‌పల్లి మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో ప్రొద్దుటూరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగు నీరు రహదారిపైకి చేరడంతో పాటు బ్రిడ్జి పూర్తిగా నీటమునిగిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా వాగు నీటి మట్టం వేగంగా పెరిగి, బ్రిడ్జి పైభాగాన్ని ముంచేసింది. అత్యవసర అవసరాల కోసం వెళ్తున్న ప్రయాణికులు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు తమ గమ్యస్థానాలకు చేరుకోలేక ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన మోకిలా సీఐ వీరబాబు గౌడ్ స్వయంగా ప్రొద్దుటూరు వాగు ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. వాగు ప్రాంతానికి దగ్గరగా వెళ్లరాదని, ఎవరూ అజాగ్రత్తగా వ్యవహరించకూడదని ఆయన సూచించారు. వర్షాలు ఇంకా కొనసాగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వాగు ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకుని రహదారి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూ, నీటి మట్టం తగ్గే వరకు రాకపోకలను అనుమతించబోమని స్పష్టంచేశారు. స్థానికులు అయితే ప్రతి ఏడాది వాగు పొంగిపొర్లితే ఇదే సమస్య ఎదురవుతోందని, శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. నీటి మట్టం తగ్గే వరకు రాకపోకలు పునరుద్ధరించే అవకాశమే లేదని అధికారులు చెబుతుండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Related posts