బీసీల ఆశలు అడియాసలు.
-హైకోర్టు స్టే తో ఆగిన ఎన్నికల ప్రక్రియ.
-నేడు రాష్ట్ర బందుకు బీసీ సంఘాల పిలుపు.
వనపర్తి ప్రతినిధి అక్టోబర్ 09(ప్రజాక్షేత్రం):బీసీలకు రాజ్యాధికారం దిశగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు) స్టే విధించడంతో బీసీల ఆశలు అడియాసలయ్యాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం తొలి దశ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఆశావహులు ఆయా స్థానాలకు పోటీ చేసేందుకు కసరత్తు చేసుకున్నారు. బుధవారం హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై సుదీర్ఘ వాదోపవాదాలు జరగడం ప్రసార మాధ్యమాల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తోందని వార్తలు వెలువడడంతో బీసీ నాయకులు ఎన్నికల ప్రక్రియ సజావుగానే సాగవచ్చని భావించి ఎన్నికల బరిలో దిగేందుకు దూకుడు ప్రదర్శించారు. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల దూకుడుకు గురువారం అనూహ్యంగా స్థానిక ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ఆగిపోయినట్లయింది. ఈ ఎన్నికలకు ముందు దసరా పండగ రావడంతో అప్పటినుంచి బతుకమ్మ పండగ పేరుతో ఆశావహులు ప్రజలను తమకు అనుకూలంగా తిప్పుకునేందుకు శక్తి కొలది ప్రయత్నాలు కూడా చేశారు. ఈ క్రమంలోనే ఎన్నికలు రావడంతో బీసీలు పోటీ చేసేందుకు ముందుకు సాగారు. బీసీలు పోటీ చేసే ఆయా స్థానాల్లో అగ్రకుల నాయకులకు మింగుడు పడని, దిక్కుతోచని స్థితిలో అంతర్గత సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లపై తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తూ వస్తోంది. బీసీలు రాజ్యాధికారం లక్ష్య సాధనలో రిజర్వేషన్ల అనుకూల ఫలాలను అందుకునే క్రమంలో హైకోర్టు స్టే విధించడంతో బిసి ఆశావహుల్లో అసంతృప్తితో పాటు ఐక్యతరాగం ప్రదర్శిస్తున్నారు. పార్టీలకతీతంగా బీసీ నాయకులంతా ఒకరికొకరు చర్చలు జరుపుకుంటూ భవిష్యత్ కార్యాచరణ పై రాజకీయ పార్టీలే కాకుండా ప్రజా సంఘాలు గొంతు కలుపుతూ నేడు బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర బందుకు పిలుపునిచ్చారు.
– అధికారుల హడావిడికి కళ్లెం
ఎన్నికల సంఘం గతంలో జారీ చేసిన షెడ్యూల్ తో పాటు గురువారం నోటిఫికేషన్ జారీ చేయడంతో గత పది రోజులుగా ఎన్నికల శిక్షణ, అవగాహన, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, నామినేషన్ కౌంటర్ల ఏర్పాటు, ఎన్నికల ప్రక్రియపై అనుసరించాల్సిన వ్యూహాలు, రిటర్నింగ్ అధికారుల బాధ్యతలు, శాంతి భద్రతలు వంటి తదితర అంశాలపై విస్తృతంగా కలెక్టర్, ఎస్పీ మొదలుకొని దిగువ స్థాయి అధికారుల వరకు ఎన్నికల ప్రక్రియపై అవగాహన అవగాహన కల్పిస్తూ వచ్చారు. ఎన్నికల ప్రక్రియపై అధికారులు వేగవంతంగా ముందుకు సాగడంతో పాటుగా తొలి దశ నోటిఫికేషన్ లకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈరోజు సాయంత్రం లోగా నామినేషన్ పత్రాలు దాఖలవుతాయని నామినేషన్ కేంద్రాల వద్ద అధికారులు వేచి ఉండడంతో పాటుగా హైకోర్టు నిర్ణయం పై కూడా ఆసక్తిగా ఆరా తీస్తూ విధులు నిర్వహించారు. ఈ క్రమంలోనే అధికారులు, ఆశావహులు ఎన్నికల నోటిఫికేషన్ పై, హైకోర్టు వాదనలపై ఎప్పుడెప్పుడు ఏమి జరుగుతుందోనని తెలుసుకునేందుకు ఉత్కంఠగా తమ దగ్గర ఉండే స్మార్ట్ ఫోన్లు, ప్రసార మాధ్యమాలకు హత్తుకు పోయారు. తీరా హైకోర్టు స్టే విధిస్తున్నట్లు తెలియడంతో గురువారం సాయంత్రానికి అంతా నిశ్శబ్దం అలుముకుంది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ అధికారుల నుండి మొదలుకొని రాజకీయ పార్టీల నాయకుల వరకు బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు విధించిన స్టే పై చర్చ జరుగుతుండడం గమనార్హం.
