Praja Kshetram
తెలంగాణ

మల్కాజిగిరి ఎస్‌ఓటీ-కీసర పోలీసులు సంయుక్తంగా డ్రగ్ రాకెట్‌ బట్టబయలు

మల్కాజిగిరి ఎస్‌ఓటీ-కీసర పోలీసులు సంయుక్తంగా డ్రగ్ రాకెట్‌ బట్టబయలు

 

– ఓపియం రవాణా రాకెట్‌ బట్టబయలు

– కీసరలో మల్కాజిగిరి ఎస్‌ఓటీ సూపర్‌ ఆపరేషన్‌

– రూ.1 కోటి విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం

కీసర, అక్టోబర్‌ 11(ప్రజాక్షేత్రం):మత్తు పదార్థాల అక్రమ రవాణాపై మల్కాజిగిరి స్పెషల్‌ ఆపరేషన్స్‌ టీం (ఎస్‌ఓటీ), కీసర పోలీసులు సంయుక్తంగా దాడి చేసి ఓ అంతర్రాష్ట్ర డ్రగ్‌ రాకెట్‌ను బట్టబయలు చేశారు. ఈ ఆపరేషన్‌లో రాజస్థాన్‌కు చెందిన ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని రూ.1 కోటి విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం, పట్టుబడిన నిందితుడు లోకేష్‌ బారేత్‌ (26) రాజస్థాన్‌కు చెందినవాడు. మొదట టెక్స్టైల్‌ షాపులో, తరువాత పిజ్జా డెలివరీ బాయ్‌గా పని చేసిన అతను, తరువాత హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తి చేసి ఉదయపూర్‌లో హోటల్‌ మేనేజర్‌గా పనిచేశాడు. కొంతకాలం తర్వాత ఉద్యోగం కోల్పోవడంతో జగదీష్‌ గుజ్జర్‌ అనే వ్యక్తితో కలిసి మత్తు పదార్థాల రవాణా వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. వీరిద్దరూ రాజస్థాన్‌ నుంచి ఓపియం, పాపీ స్ట్రా సేకరించి హైదరాబాద్‌, చెన్నై, పరిసర ప్రాంతాలకు సరఫరా చేస్తూ అక్రమంగా డబ్బు సంపాదించేవారు. గత ఆగస్టులో కూడా కాచిగూడ రైల్వేస్టేషన్‌ వద్ద 2 కిలోల ఓపియం ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. తాజాగా హైదరాబాద్‌కు రవాణా చేస్తుండగా ఎస్‌ఓటీ మల్కాజిగిరి అధికారులు, కీసర పోలీసులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ముట్టడిలో నిందితుడు చిక్కాడు. అతని వద్ద నుంచి ఓపియం 7 కిలోలు, పాపీ స్ట్రా 2 కిలోలు, మొబైల్‌ ఫోన్‌ 1 స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.1 కోటిగా అంచనా వేశారు. ఈ ఘటనపై కీసర పోలీస్‌స్టేషన్‌లో ఎన్‌డిపీఎస్‌ చట్టం 1985 సెక్షన్‌ 17(సి), 18(బి) కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న జగదీష్‌ గుజ్జర్‌ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. రాచకొండ పోలీసు కమిషనర్ జి. సుధీర్ బాబు పర్యవేక్షణలో, పి.వి. పద్మజ డిసిపి మల్కాజిగిరి మార్గదర్శకత్వంలో జరిగాయి. ఈ ఆపరేషన్‌ను ఏ. రమణా రెడ్డి డిసిపి ఎస్‌ఓటీ-1 మల్కాజిగిరి మరియు భువనగిరి, ఎన్. నర్సింహా రెడ్డి ఏడీసిపి ఎస్‌ఓటీ-1, సి. అంజయ్య ఏసిపి ఎస్‌ఓటీ-1 ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్లు జి. జానయ్య, ఎం. సాయికుమార్ ఎస్‌ఐపీ మరియు ఎస్‌ఓటీ, ఎం. సాయికుమార్ ఎస్‌ఓటీ మల్కాజిగిరి పాల్గొన్నారు. అలాగే అంజనీ కేసు బృందం కూడా ఆపరేషన్‌లో భాగమైంది తెలిపారు.

Related posts