ఉరితీస్తారా.. ఎన్కౌంటర్ చేస్తారా.!
– ఆదిపత్య కులస్తులవే ప్రాణాలా.?
– అత్యంత పాశవిక హత్యపై స్పందించేందుకు రాజకీయ నాయకుల ఊగిసలాట సిగ్గుచేటు..
– ఎన్కౌంటర్ చేసి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి..
కేశంపేట నవంబర్ 16(ప్రజాక్షేత్రం):ఆదిపత్య కులాలకు అన్యాయం జరిగినప్పుడు పేలుతున్న పోలీసుల తుపాకీ అణచబడిన వర్గాలకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు మూగబోతోందని గిరిజన సంఘం కేశంపేట మండల నాయకుడు బద్రునాయక్, ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షుడు చెర్ర రమేష్ మాదిగ ప్రశ్నించారు. పరుఖ్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు రాజశేఖర్ ను బీసీ సామాజిక వర్గానికి చెందిన కుల దురహంకారులు అత్యంత పాశవికంగా హత్య చేయడంపట్ల ఆదివారం కేశంపేట మండల కేంద్రంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. రాజశేఖర్ ను హతమార్చిన దుండగులను బహిరంగంగా ఉరితీయడం కుదరని పక్షంలో ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. యువతి కుటుంబ సభ్యుల నుంచి తమ కుటుంబానికి ముప్పు ఉందని షాద్ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ప్రచారం జరుగుతుందని, పోలీసులు సమయానికి స్పందించి ఉంటే ఓ నిండు ప్రాణం దక్కేదన్నారు. సమాజంలోని కలుపు మొక్కలు కులదురహంకారులని కలుపు మొక్కలను సమాజం నుంచి ఏరివేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. షాద్ నగర్ నియోజకవర్గంలో అనుక్షణం వార్తల్లో నిలిచే రాజకీయ నాయకులు దళిత యువకుడి దారుణ హత్యపై నోరు మెదపకుండా మిన్నకుండిపోవడం సిగ్గుచేటన్నారు. ఆంధ్రాలో బస్సు ప్రమాదం జరిగితే సంతాపం తెలిపేందుకు పెకిలిన రాజకీయ నోరు నేడు మన కళ్ళ ముందు కదలాడుతున్న ఘోరాన్ని చూసి కూడా ఎందుకు మౌనవ్రతం వహిస్తుందని ప్రశ్నించారు. ఆధిపత్య సామాజిక వర్గానికి చెందిన వారివి మాత్రమే ప్రాణాలు కావని అనగారిన, అణచబడిన వర్గాల పేద ప్రజలవి సైతం ప్రాణాలేనని గుర్తించి హత్య చేసిన నిందితులను ఎన్కౌంటర్ చేసి తెలంగాణ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.
