సమానత్వ సందేశంతో మహాత్మా పూలే 135వ వర్ధంతి
సైనిక్ పూరి నవంబర్ 29(ప్రజాక్షేత్రం):కాప్రా మున్సిపల్ పరిధిలోని సైనిక్ పురి చౌరస్తాలో మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పూలే విగ్రహానికి నేతలు పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పూలే జీవితాంతం సమాజ సమానత్వం కోసం చేసిన పోరాటం నేటికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలు, మహిళల విద్య కోసం చేపట్టిన ఉద్యమాలు చరిత్రలో నిలిచిపోయాయని అన్నారు. కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పూలే సిద్ధాంతాలు యువతకు దిశానిర్దేశమని, ఆయన చూపిన మార్గం సామాజిక న్యాయానికి పునాదిగా నిలుస్తుందని వెల్లడించారు. ఏఎస్ రావు నగర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేశెట్టి ప్రసాద్ మాట్లాడుతూ పూలే ఆలోచనలు సమాజ మార్పుకు ప్రేరణ అని అన్నారు. పూలే విలువలను ఆచరిస్తేనే సమానత్వ సమాజం సాధ్యమని చెప్పారు. మాజీ కార్పొరేటర్ పజ్జూరి పావని మహిపాల్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకుడు కాసం మహిపాల్ రెడ్డి, కొత్త అంజి రెడ్డి సహా పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. విగ్రహం వద్ద శుభ్రత కార్యక్రమం నిర్వహించిన అనంతరం పూలే జీవితం, సేవలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.
