గ్రామాల్లో కాకరేపుతున్న పంచాయతీ ఎన్నికలు
– అసలు సర్పంచి జీతం ఎంతో తెలుసా?
– సర్పంచిలకు గౌరవ వేతనం నెలకు రూ.6,500 చెల్లిస్తున్న ప్రభుత్వం
– ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ప్రకారం సర్పంచికి ప్రత్యేక ఆహ్వానం
– గ్రామానికి ప్రథమ పౌరుడి, పౌరురాలిగా గౌరవం
తెలంగాణ బ్యూరో నవంబర్ 30(ప్రజాక్షేత్రం):గ్రామ పంచాయతీకి ఎన్నికయ్యే సర్పంచి అంటే గ్రామానికి ప్రథమ పౌరుడి, పౌరురాలిగా మంచి గౌరవం దక్కుతుంది. ప్రభుత్వం నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ప్రకారం సర్పంచిని తప్పకుండా ఆహ్వానిస్తారు. గౌరవ వేతనం కింద ప్రభుత్వం నెలకు రూ.6,500 వారి బ్యాంకు ఖాతాలో వేస్తుంది. సర్పంచి పదవిలో ఉన్నవారికి కొన్ని అధికారాలతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి. నెలకోసారి పంచాయతీ పాలకవర్గంతో కలిసి సమావేశం ఏర్పాటు చేయించాల్సి ఉంటుంది. రెండు నెలలకోసారి గ్రామసభ తప్పనిసరిగా నిర్వహించాలి.
గ్రామాభివృద్ధి నిధులను సక్రమంగా వినియోగించాలి :
పంచాయతీలోని ఆదాయ, వ్యయాల ఖాతాలను సర్పంచి తనిఖీ చేయించాలి. గ్రామాభివృద్ధి నిధులను సక్రమంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలి. గ్రామంలో పచ్చదనాన్ని పెంపోందించడం కోసం మొక్కలు నాటించాలి. వీటిలో 85 శాతం మొక్కలు బతికేలా చర్యలు చేపట్టాలి. గ్రామంలో నర్సరీని ఏర్పాటు చేయించాలి. ప్రతి ఇంటా మరుగుదొడ్డి నిర్మించుకొని వాడుకునేలా గ్రామ ప్రజలకు ప్రోత్సహించాలి. చెత్తాచెదారం రోడ్డుపై వేస్తే రూ.500 జరిమానా విధించే అధికారం సర్పంచికి ఉంటుంది. పారిశుద్ధ్యం బాగుండేలా చర్యలు తీసుకోవాలి.
ఉప సర్పంచి, వార్డు సభ్యులకు పారితోషికం, గౌరవ వేతనం లాంటివి ఏమి ఉండదు. గ్రామానికి సేవ చేసి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోవటానికి మాత్రమే ఈ పదవులు ఉపయోగపడతాయి.
వార్డు సభ్యులు మూడు సమావేశాలకు, మహిళా సభ్యులు ఆరు సమావేశాలకు వరుసగా హాజరుకాకపోతే జిల్లా కలెక్టర్ వారిని పదవికి అనర్హులుగా ప్రకటిస్తారు.
సర్పంచి తన విధులను సక్రమంగా నిర్వహించకపోయినా, రెండు నెలలకు ఒకటి చొప్పున మూడుసార్లు గ్రామసభలు జరపకపోయినా చట్టంలోని సెక్షన్-33 ప్రకారం సర్పంచి తన పదవిని కోల్పోయే అవకాశం ఉంది. అవినీతి ఆరోపణలు నిరూపితమైతే ప్రజాప్రతినిధ్య చట్టం-1951లోని సెక్షన్-8 కింద పదవి నుంచి తొలగిస్తారు. గ్రామ పంచాయతీ ఆడిట్, లెక్కలు పూర్తి చేయకపోతే సెక్షన్-23 ప్రకారం తప్పకుండా వేటుపడుతుంది. మూడంచెల పంచాయతీరాజ్ విధానంలో మొదటిది గ్రామ పంచాయతీ. దీనికి గ్రామ సర్పంచ్ రాజకీయ అధిపతి. సర్పంచ్‌కు పరిపాలనలో సహకరించేందుకు పంచాయతీ కార్యదర్శి ఉంటారు. వీరిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. వీరిద్దరి సమన్వయంతోనే గ్రామ పంచాయతీ తన అధికారాలు, విధులను సమర్థవంతంగా నిర్వహిస్తుంది.
సర్పంచి అధికారాలు, విధులు :
గ్రామ పంచాయతీ, గ్రామసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు.
గ్రామంలో ప్రథమ పౌరులుగా వ్యవహరిస్తారు.
పంచాయతీ స్థాయిలో రాజకీయ అధిపతిగా ఉంటారు.
పంచాయతీకి సంబంధించిన రికార్డుల తనిఖీలు నిర్వహిస్తారు.
పంచాయతీ పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల నుంచి సమాచారం తీసుకోవచ్చు.
పంచాయతీ వార్షిక ఖాతాలను ఏటా క్రమం తప్పకుండా ఆడిటింగ్ చేయించాలి.
పంచాయతీ సెక్రటరీపై పరిపాలనాపరమైన నియంత్రణ కలిగి ఉంటారు.
పంచాయతీ చేసిన తీర్మానాల అమలుకు కట్టుబడి కృషి చేస్తారు.
తన పరిధిలోని ప్రాథమిక పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం మొదలైన వాటిని సందర్శించి, వాటి పనితీరును పరిశీలిస్తారు.
గ్రామ పంచాయతీలోని వార్డు సభ్యుల అనర్హతలను జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి తీసుకెళ్తారు.
తొలగింపు
సర్పంచ్ అధికార దుర్వినియోగానికి పాల్పడినా, ప్రభుత్వ చర్యలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయకపోయినా జిల్లా కలెక్టర్ పదవి నుంచి తొలగిస్తారు. ఇలా పదవి కోల్పోయిన వారు రెండేళ్ల వరకు సంబంధిత పదవులకు తిరిగి పోటీ చేసే అవకాశం కోల్పోతారు.
