శేరిగూడ గ్రామపంచాయతీ ఎన్నికల వివాదంపై మండల కార్యాలయం ఎదుట నిరసన.
– ఎంపీడీవో వెంకయ్య గౌడ్ సస్పెన్షన్‌కు డిమాండ్.
– “న్యాయం జరిగే వరకు పోరాటం” అంటూ గ్రామ ప్రజల నినాదాలు.
శంకర్ పల్లి డిసెంబర్ 20(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మండల పరిధిలోని శేరిగూడ గ్రామంలో గత రెండు మూడు రోజులుగా కొనసాగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల వివాదంపై శనివారం గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో శంకర్ పల్లి మండల ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు దొరల పాలన వద్దు, ఎంపీడీవో వెంకయ్య గౌడ్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలి అంటూ నినాదాలు చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో అన్యాయాలు జరిగాయని, అధికారుల తీరు పక్షపాతంగా ఉందని ఆరోపించారు. ఎన్నికల పనుల నిమిత్తం వచ్చిన అనిత వద్ద సరైన ఉత్తర్వుల ప్రతులు లేవని, ఆర్డర్ కాపీ చూపలేదని గ్రామస్తులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. గ్రామ ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని నిరసనకారులు స్పష్టం చేశారు.
