మూగజీవాల రక్తం అక్రమ వ్యాపారం బట్టబయలు
నాగారంలో అర్ధరాత్రి పోలీసుల జాయింట్ ఆపరేషన్
రక్తం సేకరణ ముఠా అరెస్ట్
నాగారం, జనవరి 04(ప్రజాక్షేత్రం):మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని నాగారం డివిజన్ సత్యనారాయణ కాలనీలో అర్ధరాత్రి పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో మూగజీవాల రక్తాన్ని అక్రమంగా సేకరిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రహస్య సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించగా, ఓ మటన్ షాప్‌లో మేకలు, గొర్రెల నుంచి రక్తాన్ని సేకరించి అక్రమంగా నిల్వ చేసి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో మటన్ షాప్ యజమానితో పాటు నకిలీ వెటర్నరీ డాక్టర్, మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. ముఠా వద్ద నుంచి సుమారు 130 రక్తపు ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రక్తాన్ని ప్లేట్లెట్స్ తయారీకి, కొన్ని వ్యాధుల చికిత్సల పేరుతో వినియోగిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. సేకరించిన రక్తాన్ని సుమారు 130 బ్యాగ్‌ల్లో నిల్వ చేసి కాచిగూడలోని సి.యన్.కె,సంస్థకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అడ్డగోలుగా మేకలు, గొర్రెల నుంచి రక్తాన్ని తీసుకోవడం వల్ల అవి ఒకటి, రెండు రోజుల్లోనే మృతి చెందే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమైన చర్యగా పేర్కొన్న పోలీసులు, సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
