తగ్గేదేలే అంటున్న బెల్ట్ షాపులు….నిద్ర వ్యవస్థలో ఎక్సైజ్ శాఖ.
– పుట్టగొడుగుల్లా దర్శనమిస్తున్న బెల్ట్ షాపులు.
– పరదా కట్టు……బెల్ట్ షాప్ పెట్టు.
– అడ్డు అదుపు లేని బెల్ట్ షాపులతో… విసిగిపోతున్న స్థానిక ప్రజలు.
– ప్రేక్షక పాత్ర వహిస్తున్న కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ అధికారులు.
కుత్బుల్లాపూర్ జనవరి 04(ప్రజాక్షేత్రం):కాంగ్రెస్ మేనిఫెస్టో ఎన్నికల ముందు హామీలలో భాగంగా బెల్ట్ షాపులు పూర్తిగా రద్దు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆ హామీ అలంకారప్రాయంగానే ఉంది. కానీ క్షేత్రస్థాయిలో అమలకు నోచుకోవడం లేదని చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. గల్లి గల్లి బెల్ట్ షాప్… మాకు నో టైమింగ్స్ నో ఎమ్మార్పీ రేట్స్… తెలంగాణ ప్రభుత్వం వైన్ షాపులకు టెండర్లు వేసి మరి లక్కీ డ్రా ద్వారా వైన్ షాపులను కేటాయిస్తుంది. కానీ ఈ వైన్ షాపులకు అనుసంధానంగా అనేక బెల్ట్ షాపులు గల్లీకి నాలుగు నుండి ఐదు బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. ఈ తతంగం అంతా కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పరిధిలో జరుగుతుంది. వైన్ షాపులు మరియు బార్లు సమయపాలన పాటిస్తూ ఉంటారు. కానీ బెల్ట్ షాపు వారు మాత్రం ఎనీ టైం మందు, 3 నైంటిలు 6 క్వాటర్లతో 24 గంటలు బెల్టు షాపులు మందుబాబులతో దర్శనమిస్తుంటారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బెల్ట్ షాపులను మహిళలు కూడా నిర్వహిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో రాత్రి సమయాలలో మహిళలు దగ్గర ఉండి మద్యం అమ్మకాలు చేస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాలలో బెల్ట్ షాపుల దగ్గర గొడవలైన సందర్భాలు చాలా ఉన్నాయి.
– నిత్యవసర సరుకుల్లా కిరాణా షాపుల్లో మద్యం అమ్మకాలు.
ఈ మద్యం వ్యాపారం బెల్టు షాపుల ద్వారా ఇష్టారాజ్యంగా కొనసాగుతోంది. కిరాణ షాపుల్లోనే నిత్యవసర సరుకుల మాదిరిగా మద్యం అమ్మకాలను సాగిస్తున్నారు. అధికారులు మాత్రం బెల్టుషాపుల నిర్వహణపై ఉక్కుపాదం మోపుతాయని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రతి గల్లీలో రెండు నుంచి ఐదు వరకు మద్యం బెల్టుషాపులు కొనసాగుతున్నాయి. ఈ విషయం ఎక్సైజ్ శాఖ అధికారులకు తెలిసినా పట్టనట్లు ఉంటున్నారు. నామమాత్రంగా అప్పుడప్పుడు దాడులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు.
– ఎమ్మార్పీ రేటుకు 20 శాతం అదనంగా తీసుకుంటున్న బెల్ట్ షాప్ వారు.
మద్యం షాపుల్లో ఎమ్మార్పీ రేటుకు మద్యం అమ్ముతున్నప్పటికీ బెల్లు షాపుల్లో మాత్రం రేట్లను 10 నుంచి 20 శాతం పెంచి విక్రయాలు జరుపుతున్నారు. ప్రత్యేకంగా ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపులను నియంత్రించడంలో ఘోరంగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ అధికారుల పనితీరు చూస్తూ ఉంటే ఎక్సైజ్ అధికారులు ఆఫీసుకు మాత్రమే పరిమితం అవుతున్నారు. కానీ ఏనాడు కూడా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అని దాడులు నిర్వహించిన దాఖలాలు మాత్రం ఎక్కడ కూడా కనిపించడం లేదు. అంతో ఇంతో పోలీసులు మాత్రం అక్కడక్కడ తనిఖీలు నిర్వహించి వారి పైన కేసులు నమోదు చేస్తున్నారు.
– అక్రమంగా సిట్టింగ్లు ఏర్పాటు.
బెల్టు షాపుల్లో సిట్టింగ్ ఏర్పాట్లు చేస్తున్నా పట్టించుకొనేవారు లేరు. ఆహార పదార్థాలు తయారు చేస్తూ మందుబాబులకు అందజేస్తున్నారు. బెల్టు షాపుల మధ్య పోటీ పెరగడంతో కస్టమర్లను ఆకర్శించేందుకు ఇళ్లలోనే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. బార్ అండ్ రెస్టారెంట్ల మాదిరిగా బెల్టు షాపుల్లో చికెన్, మటన్, గుడ్లు, ఆమ్లేట్, తదితర ఆహార పదార్థాలను వండి అందజేస్తున్నారు.
– వైన్ షాపుల నుండి విచ్చలవిడిగా….బెల్ట్ షాపుల వారికి అమ్మకాలు.
అనుమతి పొందిన వైన్ షాపుల నుంచే వందల సంఖ్యలో మద్యం బాటిల్లు బెల్టు దుకాణాలకు తరలిస్తున్నట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. సంబంధిత ఎక్సైజ్ శాఖ అనుసంధానంలో, బెల్టు దుకాణాల నిర్వహణకు ప్రోత్సాహం ఉందని విమర్శలు వెలువెత్తుతున్నాయి. కుత్బుల్లాపూర్ లోని దుండిగల్, సూరారం, గండి మైసమ్మ, బాచుపల్లి, బౌరంపేట్, కుత్బుల్లాపూర్, కొంపల్లి, దూలపల్లి, సుచిత్ర, చింతల్, ఐడిపిఎల్, జగదిరిగుట్ట సుభాష్ నగర్ ప్రాంతాలలో బెల్ట్ షాపులు కొనసాగుతూ ప్రజలు మత్తులో చిత్తవుతున్నా.. నిరోధించాల్సిన సంబంధిత శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. బెల్ట్ షాపులు ప్రజలను మత్తులో ముంచెత్తుతున్నాయి. కానీ ఆబ్కారీ శాఖ అధికారులు మాత్రం కన్నెత్తి కూడా చూడటం లేదు.. ఇప్పటికైనా కుత్బుల్లాపూర్ ఆబ్కారీ శాఖ అధికారులు స్పందించి వెంటనే బెల్ట్ షాపులపై మూసి వేయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
– బెల్ట్ షాపులు నడుస్తున్న ప్రేక్షక పాత్ర వహిస్తున్న కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ అధికారులు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బెల్ట్ షాపులు యథేచ్ఛగా కొనసాగుతుండటంతో ఎక్సైజ్ శాఖ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నివాస ప్రాంతాల్లో, కాలనీల్లో అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నా అధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రాంతంలోని పలు కాలనీల్లో బెల్ట్ షాపులు బహిరంగంగా నడుస్తున్నాయని, రోజంతా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. బెల్ట్ షాపుల నిర్వాహకులు అధికారుల భయమే లేకుండా బహిరంగంగా వ్యాపారం కొనసాగిస్తున్నారు. అప్పుడప్పుడు జరిగే దాడులు కేవలం పేరుకే పరిమితమవుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.బెల్ట్ షాపులు ఇలాగే బహిరంగంగా నిర్వాహకులు నడిపిస్తే శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని స్థానిక నాయకులు పేర్కొంటున్నారు. వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని కుత్బుల్లాపూర్లో బెల్ట్ షాపులపై ప్రత్యేక దాడులు నిర్వహించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ మేల్కొని అక్రమ బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపకపోతే ప్రజా ఆగ్రహం మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. కొందరు బెల్ట్ షాప్ యజమానులు మాత్రం బహిరంగంగానే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వెళ్తారు అని చెప్పుకు వస్తున్నారు?. ఇది ప్రస్తుతం కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ అధికారుల పనితీరు ఇలా ఉన్నదని చెప్పుకోవచ్చు.
