Praja Kshetram
తెలంగాణ

అనుమతికి మించిన నిర్మాణాలు….ఉలుకు పలుకు లేని టౌన్ ప్లానింగ్ అధికారులు.

అనుమతికి మించిన నిర్మాణాలు….ఉలుకు పలుకు లేని టౌన్ ప్లానింగ్ అధికారులు.

 

– మున్సిపల్ నుండి జిహెచ్ఎంసిగా మారిన అక్రమ నిర్మాణాలు ఆగడం లేదు.

– అక్రమ నిర్మాణాలు కళ్ళ ముందు కనిపించిన చర్యలు తీసుకొని అధికారులు.

– సర్కిల్ కార్యాలయానికి కూతవేటు దూరంలో అక్రమ నిర్మాణాల పరంపర.

– ఓ ప్రజా ప్రతినిధి అండదండలతో అక్రమ నిర్మాణాలు.

కుత్బుల్లాపూర్ జనవరి 04(ప్రజాక్షేత్రం):దుండిగల్ సర్కిల్ మున్సిపల్ పరిధి నుంచి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోకి వచ్చిన ప్రాంతాల్లో అనుమతికి మించిన నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే దుండిగల్ సర్కిల్ పరిధిలోని గండి మైసమ్మ లో జీహెచ్‌ఎంసీ నిబంధనలు అమల్లోకి వచ్చినప్పటికీ అక్రమ నిర్మాణాలపై అధికారులు కఠినంగా వ్యవహరించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గండి మైసమ్మ ప్రాంతంలో అడ్డగోలుగా జరుగుతున్న అనుమతికి మించిన నిర్మాణాలు జరుగుతున్నాయి. నిబంధనలు, అనుమతులు అన్నింటినీ తుంగలో తొక్కుతూ భవన నిర్మాణాలను చేపడుతున్నారు. అధికార యంత్రాంగం మౌనం వహించడం వెనుక స్థానిక ప్రజా ప్రతినిధి అండదండలే కారణమా? అనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ కాలంలో పొందిన అనుమతులను ఆసరాగా చేసుకుని, జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వచ్చిన తర్వాత అదనపు అంతస్తులు, సెట్ బ్యాక్స్ లేకుండా, కమర్షియల్ నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అనుమతి ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నా సంబంధిత అధికారులు నిశ్శబ్దంగా ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వచ్చిన తర్వాత నిబంధనలు మరింత కఠినంగా అమలు కావాల్సి ఉండగా, పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని పట్టణ ప్రణాళిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అక్రమ నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

– ఓ ప్రజా ప్రతినిధి కనుసైగలలో…. అనుమతికి మించిన నిర్మాణాలు.

స్థానికంగా ఉండే ఓ ప్రజాప్రతినిధి తన అండదండలతో అనుమతికి మించిన నిర్మాణాల వెనక ఉన్నాడని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. అనుమతికి మించి ఉన్న నిర్మాణాల దగ్గరికి స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారులు వెళ్లకపోవడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. చర్యలు తీసుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులే వెనకడుగు వేస్తున్నారు.అనుమతికి మించినా నిర్మాణాలపైన మరి చర్యలు ఉంటాయా ? అని స్థానికులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి, అనుమతికి మించిన నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Related posts