పీఠం ఎవరిది?
– రిజర్వేషన్ల ముందే మొదలైన మంతనాలు.
– ఆశావాహులతో శంకర్ పల్లి వేడెక్కింపు.
– నువ్వా నేనా అన్నట్టు మున్సిపాలిటీ సమరం.
శంకర్ పల్లి, జనవరి 08(ప్రజాక్షేత్రం): రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల నియోజకవర్గంలో శంకర్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికలు రాజకీయంగా హీట్ పెంచుతున్నాయి. ఇంకా రిజర్వేషన్లు ఖరారు కాకముందే మున్సిపాలిటీ చైర్మన్ పీఠంపై కన్నేసిన రాజకీయ నేతలు కదలికలు మొదలుపెట్టారు. అధికార, ప్రతిపక్ష పార్టీల్లో అంతర్గత మంతనాలు, రహస్య సమావేశాలు జోరుగా సాగుతున్నాయని నియోజకవర్గం మొత్తం గుసగుసలతో మార్మోగుతోంది. నియోజకవర్గ కేంద్రంగా ఉన్న శంకర్ పల్లి, చేవెళ్ల, మొయినాబాద్ మున్సిపాలిటీ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే లక్ష్యంతో పలువురు ఆశావాహులు ఇప్పటికే సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. రిజర్వేషన్లు ఎప్పుడు ఖరారవుతాయన్న ఉత్కంఠలో ఉండగానే, ఎవరి బలం ఎంత? ఎవరి వెనుక ఎవరు? అన్న లెక్కలు మొదలయ్యాయి. అధికార పార్టీ నుంచి ఎవరు బరిలోకి దిగుతారు? ప్రతిపక్షం ఎలాంటి వ్యూహంతో ముందుకు వస్తుంది? అన్న అంశాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ పోరులో కులాల సమీకరణాలు, ఆర్థిక బలం, వ్యక్తిగత పలుకుబడి, ఓటర్లపై ప్రభావం వంటి అంశాలు కీలకంగా మారుతున్నాయి. గెలుపే లక్ష్యంగా నేతలు తమ తమ బలాబలాలను తూకం వేస్తూ, ఓటర్లను ఆకర్షించే దిశగా అడుగులు వేస్తున్నారని స్థానికంగా చర్చ నడుస్తోంది. మున్సిపాలిటీ కావడంతో పీఠం ప్రతిష్ఠాత్మకంగా మారింది. అందుకే ఈసారి పోరు సాధారణంగా కాకుండా రనరంగంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయో, ఎవరి వ్యూహం పనిచేస్తుందో, చివరికి మున్సిపాలిటీ పీఠం ఎవరి పక్షన నిలుస్తుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టరు శంకర్ పల్లి లో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలు రాజకీయంగా ఉత్కంఠభరితంగా, నువ్వా నేనా అన్నట్టుగా సాగనున్నాయి. గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.
