జగన్ రెడ్డి వైఎస్సార్ వారసుడు కాదు…మోదీ వారసుడు.. షర్మిల సెటైర్లు
గుంటూరు ఏప్రిల్ 26 (ప్రజాక్షేత్రం): ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సీఎం జగన్ రెడ్డి దత్త పుత్రుడని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. జగన్ రెడ్డికి అసలు సంస్కారం ఉందా అని ప్రశ్నించారు. ఆయన బీజేపీ దగ్గర మోకరిల్లారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల మీద ఏ ఒక్కరోజు కూడా కేంద్రంతో జగన్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. జగన్ రెడ్డి వైఎస్సార్ వారసుడు కాదు…మోదీ వారసుడు అని విమర్శించారు. గురువారం నాడు గుంటూరు జిల్లాలో షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
గుంటూరులో భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ, సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సొంత చెల్లెలు అని కూడా చూడకుండా వైసీపీ నేతలకు కనీసం ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. వేలాదిమంది ఉండే సభలో సొంత చెల్లెలు అని చూడకుండా తనపై అంబాఢాలు మోపారని ధ్వజమెత్తారు.
తాను వేసుకున్న బట్టల గురించి ప్రస్తావిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత దిగజారుడు రాజకీయాలు.. ఏం అవసరం ఉంది ?
అని ప్రశ్నించారు. తాను బాబు దగ్గర మోకరిల్లానని వైసీపీ నేతలు అంటున్నారని షర్మిల ఫైర్ అయ్యారు.
జగన్ ఈ విషయాన్ని ఎలా మరిచారు…
‘‘నేను పసుపు చీర కట్టుకున్నానట. టీడీపీ అధినేత చంద్రబాబు స్క్రిప్ట్ నేను చదువుతున్నానట. పసుపు కలర్ ఏమైనా చంద్రబాబుకి పేటెంట్ రైటా ..?
చంద్రబాబు పచ్చ కలర్ కొన్నారా…?
గతంలో సాక్షి ఛానెల్‌కి పసుపు రంగు ఉండేది కాదా.. …?
జగన్ రెడ్డి ఈ విషయాన్ని ఎలా మరిచిపోయాడు.
పసుపు మంగళకరం అయిన రంగని స్వయంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పారు. పసుపు రంగు టీడీపీ సొంతం కాదన్నారు. వైఎస్సార్ స్వయంగా సాక్షికి పసుపు రంగు పెట్టించారు. పసుపు మనం వంటల్లో కూడా వేస్తాం. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వారు చీర గురించి అలా మాట్లాడుతారా ?
నా వొంటిమీద ఉన్న బట్టలు గురించి మాట్లాడుతుంటే సభ్యత ఉందని అనుకోవాలా ?
చూసుకుంటూ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేది జగన్ రెడ్డినే. మక్కీకి మక్కీ చదివేది జగన్ రెడ్డి. నేను వైఎస్సార్ బిడ్డను..
నాకు మోకరిల్లే అవసరం లేదు’’ అని షర్మిల అన్నారు