Praja Kshetram
తెలంగాణ

కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి విలువ లేదా?

*కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి విలువ లేదా?*

*పార్టీ కష్టకాలంలో కష్టపడ్డ వారికి గుర్తింపు లేకపోవడం దారుణం!*

*అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం ఎంతవరకు సమంజసం?*

 

శంకర్‌ పల్లి ఏప్రిల్ 26 (ప్రజాక్షేత్రం): కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తింపు లేకుండా పోయిందని శంకర్‌ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి, నసీరుద్దీన్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రికా ప్రతినిధులతో వారు మాట్లాడుతూ స్థానికంగా కొంతమంది నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళు చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని తప్పుదోవ పట్టిస్తున్నారని, పార్టీ కోసం కష్టపడ్డ వారిని గుర్తించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ అపహాస్యం చేస్తున్నారని వారు పేర్కొన్నారు. గ్రామాలకు చెందిన సీనియర్ నాయకులు సీనియర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే క్రమంలో మమ్మల్ని పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని వారు దుయ్యబట్టారు. సీనియర్ నాయకులు పార్టీకి అవసరమా వద్దా అని వారు ప్రశ్నించారు? పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చేవారిని చూసుకొని నాయకులుగా చలామణి అవుతున్న వారు చేస్తున్న చేష్టలు జుగుప్సాకరంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. అందరినీ కలుపుకు పోయి సమన్వయంతో ముందుకు వెళ్తేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే బిఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శంకర్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి, పొద్దుటూరు గ్రామ అధ్యక్షుడు రంగారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రాజిరెడ్డి, నాయకులు ఏ నరసింహారెడ్డి, పి నర్సింహారెడ్డి లు ఉన్నారు.

Related posts