Praja Kshetram
జాతీయం

రిజ‌ర్వేష‌న్ల‌పై దుష్ప్ర‌చారం చేస్తున్నారు రాహుల్ వ్యాఖ్య‌ల‌పై అమిత్ షా ఫైర్‌

రిజ‌ర్వేష‌న్ల‌పై దుష్ప్ర‌చారం చేస్తున్నారు రాహుల్ వ్యాఖ్య‌ల‌పై అమిత్ షా ఫైర్‌

న్యూఢిల్లీ ఏప్రిల్ 28 (ప్రజాక్షేత్రం): బీజేపీ మూడోసారి అధికారంలోకి వ‌స్తే రిజ‌ర్వేష‌న్ల‌ను తొల‌గిస్తార‌ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోప‌ణ‌ల‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టించేందుకే రాహుల్ గాంధీ ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలో ఉన్నంత‌వ‌ర‌కూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేష‌న్ల‌పై పున‌రాలోచ‌న ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.
రాహుల్ గాంధీ త‌మ‌పై దుష్ప్ర‌చారం సాగిస్తూ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆరోపించారు. తాము ప‌దేండ్లుగా పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్నామ‌ని రిజ‌ర్వేష‌న్ల‌కు స్వ‌స్తి ప‌లకాల‌ని అనుకుంటే ఈపాటికే అలాంటి నిర్ణ‌యం తీసుకునేవార‌మ‌ని అమిత్ షా పేర్కొన్నారు. రిజ‌ర్వేష‌న్ల‌ను ర‌ద్దు చేసే ఆలోచ‌న త‌మ‌కు లేనేలేద‌ని తేల్చిచెప్పారు. రాహుల్ అవాస్త‌వాలు ప్ర‌చారం చేస్తున్నార‌ని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్నంత‌వ‌ర‌కూ రిజ‌ర్వేష‌న్ల‌ను తొల‌గించే అధికారం, ద‌మ్ము ఎవ‌రికీ లేద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇప్ప‌టికే బీసీలు, ద‌ళితులు, ఆదివాసీ సోద‌రుల‌కు భ‌రోసా ఇచ్చార‌ని ఆయ‌న గుర్తుచేశారు.

Related posts