హైదరాబాద్ మే 18 (ప్రజాక్షేత్రం): టీ పీసీసీ అధ్యక్ష పదవి కోసం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు పోటీ పడుతున్నారు. అదే స్థాయిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. రెడ్డి, బీసీ సామాజిక వర్గాలను కాసేపు పక్కన పెడితే.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ పేరు కూడా పీసీసీ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నూతనోత్సహాంతో ఉంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి.. అష్టకష్టాలు పడి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. పదేండ్ల పాటు ప్రతిపక్ష హోదాలో ఉన్న హస్తం పార్టీ.. మెజార్టీ స్థానాల్లో గెలుపొంది.. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించింది. పీసీసీ అధ్యక్షుడిగా అధికారాన్ని హస్తగతం చేసుకున్న రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రి పీఠంలో ఆసీనులయ్యారు. ముఖ్యమంత్రిగా ఉంటూనే పీసీసీ హోదాలో కొనసాగుతూ లోక్‌సభ ఎన్నికలను కూడా రేవంత్ ముగించేశారు. ఇక మిగిలింది ఫలితాలే. 17లో 12 స్థానాలు పక్కా హస్తం పార్టీ గెలుస్తుందనే ధీమాతో అధికార పార్టీ ఉంది.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో.. టీ పీసీసీ అధ్యక్ష పదవి కోసం రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. గతంలో పీసీసీ అధ్యక్ష మార్పుపై పార్టీలో ప్రస్తావన వచ్చినప్పుడు.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెడ్డే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతారని కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక పీసీసీ పీఠాన్ని చేజిక్కించుకునేందుకు పార్టీలోని సీనియర్లంతా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవిని చేజిక్కించుకునేందుకు ఆశావహులు చేయని ప్రయత్నమంటూ లేదు. రాష్ట్ర నాయకత్వాన్ని, పార్టీ హైకమాండ్‌ను ఆకట్టుకునేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధు యాస్కీగౌడ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పేర్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి.
మరి రేవంత్ మదిలో ఏముంది..?
టీ పీసీసీ అధ్యక్ష పదవి కోసం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు పోటీ పడుతున్నారు. అదే స్థాయిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. రెడ్డి, బీసీ సామాజిక వర్గాలను కాసేపు పక్కన పెడితే.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ పేరు కూడా పీసీసీ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయనకు నమ్మినబంటుగా అద్దంకి ఉన్నారు. ఒకానొక దశలో రేవంత్‌పై తీవ్ర విమర్శలు చేసిన నాయకులపై అద్దంకి విరుచుకుపడ్డారు. పార్టీలో రేవంత్‌కు ఎవరూ సహకరించని సమయంలో అద్దంకి మద్దతుగా నిలిచారు. అయినప్పటికీ పార్టీలో ఉన్న పలు సమీకరణాల రీత్యా అద్దంకి దయాకర్‌కు అటు ఎమ్మెల్యే, ఇటు ఎంపీ టికెట్ దక్కలేదు. చివరకు ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం కూడా వరించలేదు. దీంతో ఆయన మద్దతుదారులు ఒకింత అసహనం కూడా వ్యక్తం చేశారు. కానీ అద్దంకి మాత్రం ఏనాడూ కూడా రేవంత్‌ను విమర్శించలేదు. అంతకంటే మంచి పదవి వస్తుందేమోనని పలు వేదికలపై అద్దంకి చెప్పుకుంటూ సమాధానం దాట వేశాడు.
అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అద్దంకి దయాకర్‌ను అత్యున్నతమైన పదవిలో చూడబోతున్నారని బహిరంగంగా ప్రకటించారు. ఆ వేదికపై అద్దంకి కూడా ఉన్నారు. రేవంత్ వ్యూహాత్మకమైన ఆలోచనతో అలా వ్యాఖ్యానించడంతో జనాల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో వ్యూహాత్మకంగా రేవంత్ అద్దంకినే పీసీసీ అధ్యక్షుడిగా ఖరారు చేసి ఉంటారని తెలుస్తోంది. జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం పీసీసీ అధ్యక్ష పదవిని ఖరారు చేస్తారని గాంధీ భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. అద్దంకి పేరు ఖరారు అయిపోయిందని, అధికారికంగా ప్రకటించడం లాంఛనమేనని తెలుస్తోంది. ఇదే విషయాన్ని రేవంత్ పార్టీ హైకమాండ్‌కు చేరవేసినట్లు అద్దంకి మద్దతుదారులు చెబుతున్నారు. భవిష్యత్‌లో తనకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో, తన మాట వినేవారు ఉంటేనే పది కాలాల పార్టీ మనుగడలో ఉంటుందనే కోణంలో రేవంత్ ఆలోచించి, తనకు విశ్వాసపాత్రుడైన అద్దంకి పేరును అధ్యక్ష పదవికి ఫైనల్ చేసినట్లు సమాచారం. అదే తనకు అనుకూలంగా లేని వ్యక్తికి కట్టబెడితే తలనొప్పిగా మారే అవకాశం ఉండడం సహజమే.