తెలంగాణ కేబినెట్ భేటీకి సీఈసీ గ్రీన్ సిగ్నల్.. షరతులతో కూడిన అనుమతి
హైదరాబాద్ మే 19 (ప్రజాక్షేత్రం): తెలంగాణ కేబినెట్ భేటీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. తొలుత ఎన్నికల కోడ్ నేపథ్యంలో శనివారం జరుగాల్సిన కేబినెట్ భేటీకి ఈసీ అనుమతినివ్వలేదు. దీంతో సోమవారం వరకు అనుమతి కోసం వేచి చూసి, అనుమతి రాకపోతే రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి సీఈసీని కలిసి కేబినెట్ భేటీకి అనుమతి కోరాలని నిర్ణయించారు. అయితే ఆదివారం సీఈసీ తెలంగాణ కేబినెట్ భేటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షరతులు వర్తిస్తాయని తెలిపింది. కేబినెట్ భేటీలో అత్యవసరమైన విషయాలనే చర్చించాలని, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు కేబినెట్ భేటీలో పాల్గొనరాదని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, రైతురుణమాఫీ అంశాలను వాయిదా వేయాలని సీఈసీ షరతు విధించింది.సార్వత్రిక ఎన్నికల కోడ్ జూన్ 4వ వరకు ఉండటంతో పాటు వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆయా అంశాలపై కేబినెట్‌లో చర్చించరాదని సీఈసీ ఆంక్షలు పెట్టింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం షరతులతో కూడిన కేబినెట్ భేటీ అనుమతిపై సీఎం, మంత్రులు స్పందించాల్సివుంది. షరతులకు లోబడి సీఈసీ పేర్కోన్న అంశాలను మినహాయించి కేబినెట్ సమావేశమైతే ఆ భేటీలో ధాన్యం కొనుగోలు, ఖరీఫ్ పంట ప్రణాళిక, నిధుల సమీకరణ, జూన్ 2న రాష్ట్ర అవిర్భావ దినోత్సవం వంటి అంశాలపై మాత్రమే మంత్రి మండలి చర్చించే అవకాశముందని తెలుస్తుంది.