జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నాదే:సిట్టింగ్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్
పుల్‌కల్ మే 21 (ప్రజాక్షేత్రం): జహీరాబాద్ పార్లమెంట్‌లో తానే గెలుపొందుతానని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని సిట్టింగ్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ ధీమా వ్యక్తం చేశారు. చౌటకూర్ మండలం కేంద్రంలో కొనసాగుతున్న రేణుకా ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవాలకు మంగళవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హవా కొనసాగుతుందని, ఆయనను ప్రజలు మూడోసారి ప్రధాని చేయాలన్న సంకల్పంతో స్వచ్ఛందంగా ఓట్లు వేశారని తెలిపారు. దేశ ప్రధానిగా ఎవరు ఉండాలో ప్రజలు ఎప్పుడో తేల్చారని, ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఐదు విడతలుగా పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయని, ఈ నెల 25న ఆరో విడత, జూన్ 1న ఏడవ విడత ఎన్నికల పూర్తి కానున్నాయన్నారు. నరేంద్రమోదీకి స్పష్టమైన తీర్పునిచ్చారని, 400కు పైగానే పార్లమెంట్ స్థానాలు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఓటింగ్ సరళిలో స్పష్టమైన ఆధిక్యతను చాటామని, గెలుపుపై తమకు ఎలాంటి అనుమానం లేదన్నారు. ఎన్నడూ లేనంతగా దక్షిణ భారతంలో మోదీ హవా కొనసాగిందని, సర్వేలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. తెలంగాణలో పదికిపైగా స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తామని ఎంపీ బీబీ పాటిల్ పేర్కొన్నారు. 2019లో వచ్చిన సీట్లకంటే అదనంగా సీట్లలో పాగా వేయడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోగా, ఆలయ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరావుకులకర్ణి, బీజేపీ మండలాధ్యక్షుడు నీరుడి ప్రవీణ్‌కుమార్ ముదిరాజ్, నాయకులు రమేశ్‌బస్వరాజ్ పాటిల్, పలువట్ల జగదీశ్వర్, సార రాజ్‌కుమార్, పల్లె ప్రభుకుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.