Praja Kshetram
తెలంగాణ

అవినీతి దందా వికారాబాద్‌ ఆర్టీవో కార్యాలయం

అవినీతి దందా
వికారాబాద్‌ ఆర్టీవో కార్యాలయం

లంచగొండులకు అడ్డాగా మారిన ఆర్టీవో కార్యాలయం

ఆఫీసులో బ్రోకర్లదే హల్‌చల్‌

చేతివాటం లేకుంటే ఫైల్‌ మూలకే!

గత్యంతరం లేక బ్రోకర్ల వద్దకు వాహనదారుల పరుగులు

ఇష్టానుసారం కేటుగాళ్ల వసూళ్లు

గతంలో ఏసీబీకి పట్టుబడినా ఆగని అవినీతి పర్వం

వికారాబాద్‌ మే 21(ప్రజాక్షేత్రం): వికారాబాద్‌ ఆర్టీవో కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. అక్కడ ఏ పని కావాలన్నా చేయాల్సింది బ్రోకరే. మరి అధికారులు లేరా? అంటే ఉన్నారు! కానీ వాళ్లు ప్రజలకు ఏ పనీ నేరుగా చేయరు. లంచం తీసుకుంటున్నామనే అపవాదు వారికి రావొద్దు. బ్రోకర్‌ ఇచ్చే డబ్బులైతే ఏ సమస్యా ఉండదు. ఈ తతంగం ఆర్టీవో కార్యాలయంలో నిరంతరం కొనుసాగుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. గత కలెక్టర్లు, రవాణా శాఖ ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో ఎవరేం చేస్తారనే ధైర్యంతో బ్రోకర్లు, అధికారులు మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఆర్టీవో కార్యాలయంలో డ్రైవింగ్‌ లైసెన్సు కోసం వెళ్లినా, రెన్యూవల్‌ చేయించాలన్నా, వాహనం ఫిట్‌నెస్‌ కోసం వెళ్లినా నేరుగా ఏ పనీ కాదు. అలా చేయాలంటే దానికి సవాలక్ష కారణాలను చూపి అధికారులు ఫైల్‌ను మూలకేస్తారు. కార్యాలయం చుట్టూ తిరిగి వేసాగే పౌరులు గత్యంతరం లేక బ్రోకర్లను ఆశ్రయిస్తున్నారు. సామాన్యులు నేరుగా వెళ్తే రాని అడ్డంకులు బ్రోకర్లు వెళ్లగానే చిటుక్కున పని అయిపోతున్న పరిస్థితే వికారాబాద్‌ ఆర్టీవో కార్యాలయంలో నిత్యం కన్పిస్తోంది. ఇక్కడ అధికారుల కన్నా బ్రోకర్లదే రాజ్యం అన్నట్టుగా ఉంది. రూ.1,000 చలానాకు రూ.3,000 వరకు వసూలు చేస్తూ అందులో కొంత కార్యాలయంలోని కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు ఉన్న సిబ్బందికి అందజేస్తున్నారు.

ఒక్క రోజు రూ.లక్షల్లో బ్రోకర్ల ఆదాయం

ఆర్టీవో కార్యాలయంలో బ్రోకర్లు రాజ్యమేలుతున్నారు. ఒక్కో బ్రోకర్‌ ఆదాయం రోజుకు 10వేల నుంచి 30వేల వరకు ఉంటోంది. అక్కడ పదుల సంఖ్యలో బ్రోకర్లు దర్శనమిస్తారు. ఆవరణలో అడుగుపడితే అక్కడ కన్పించేది బ్రోకర్లే. అక్కడ ఒక్క రోజు బ్రోకర్ల ద్వారా వసూలయ్యే మొత్తమే లక్షల్లో ఉంటుంది. దానిలో కార్యాలయంలోని ఓ ప్రధాన(కానిస్టేబుల్‌) బంటు నుంచి అధికారులకువారి వాటా ఇవ్వడం నిరంతర ప్రక్రియగా మారింది. వికారాబాద్‌ ఆర్టీవో కార్యాలయంలో సిబ్బంది అక్కడొకరు ఇక్కడొకరు కన్పిస్తే బ్రోకర్లు మాత్రం అడుగడుగునా ఉంటారు. ప్రాంగణం మొదలు కార్యాలయ గదుల్లోనూ వారే రాజ్యమేలుతారు. ఓ సామాన్యుడు అధికారిని కలవాలంటే గంటల తరబడి గది గుమ్మం వద్ద నిల్చోవాలి. కానీ బ్రోకరైతే దర్జాగా ఆఫీసర్‌ వద్దకు వెళ్లి సంతకం చేయించుకుంటాడు. గతంలో ఏసీబీ దాడుల్లో ఓ అధికారి, బ్రోకర్‌ పట్టుబడ్డారు. ఆ కేసు నుంచి బయటకొచ్చిన బ్రోకర్‌ సైతం ప్రస్తుతం ఆర్టీవో కార్యాలయంలోనే తిరుగుతున్నాడు.

జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి

జిల్లాలోని తాండూరు, పరిగిలో సైతం ఇదే పరిస్థితి నెలకొందని వాహనదారులు పేర్కొంటున్నారు. బ్రోకర్లు లేనిదే ఆర్టీవో కార్యాలయాల్లో పనులు కావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 5,000వరకు లారీలుంటే తాండూరులోనే 4,500 వరకు ఉన్నాయి. పరిగి, వికారాబాద్‌లలో కలిపి 500 వరకు ఉండగా వాటి ఫిట్‌నె్‌సల కోసం బ్రోకర్లు బాగానే వసూలు చేసి అధికారులకు ఇస్తున్నారని లారీ డ్రైవర్లు పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో స్కూళ్ల బస్సుల ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించే అధికారులు డబ్బులు తీసుకుని ఫిట్‌నెస్‌ లేని బస్సులకు సర్టిఫికెట్‌ ఇస్తారని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.

చర్యలు తీసుకుంటాం : వెంకట్‌రెడ్డి, ఆర్టీవో, వికారాబాద్‌

ఆర్టీవో కార్యాలయ పరిసరాల్లో బ్రోకర్లు లేకుండా చర్యలు తీసుకుంటాం. ఎవరైనా డబ్బులడిగితే వెంటనే నా దృష్టికి తేవాలి. డబ్బిస్తేనే పనిచేస్తామన్న వారిపై చర్యలుంటాయి. వాహనదారులు ఎవరైనా బ్రోకర్లను ఆశ్రయించొద్దు. డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఫిట్‌నెస్‌ వంటివి ఏవి కావాలన్నా నేరుగా కార్యాలయ సిబ్బందినే సంప్రదించాలి. పని చేసేది అధికారులు, సిబ్బందే కానీ బ్రోకర్లు కాదు. అసలు ఆర్టీవో కార్యాలయాల్లో బ్రోకర్‌ వ్యవస్థను ప్రభుత్వం ఎప్పుడో నిషేధించింది.

Related posts