Praja Kshetram
తెలంగాణ

అన్ని రకాల వడ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇవ్వాలి: హరీశ్‌రావు

అన్ని రకాల వడ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇవ్వాలి: హరీశ్‌రావు

 

 

సిద్దిపేట మే‌ 22 (ప్రజాక్షేత్రం): అన్నిరకాల వడ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రైతులకు వడ్ల బోనస్ విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. డబ్బాలో ఓట్లు పడి, సీల్ పడ్డాక రైతులకు చావు కబురు చల్లగా చెబుతున్నారని ధ్వజమెత్తారు. చిన్న కోడూరు మండల కేంద్రంలో బుధవారం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, రైతులతో హరీశ్‌రావు మాట్లాడి వారికి అండగా ఉంటానని భరోసా కల్పించారు.ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ..తాము సన్నరకాలకే బోనస్ ఇస్తామని దొడ్డు వడ్లకు ఇవ్వమని ప్రభుత్వం చేతులు ఎత్తేసిందన్నారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఫైర్ అయ్యారు. అధికారంలోకి రావడానికి బాండ్ పేపర్ మీద 6 గ్యారెంటీలను రాసిన విధంగానే సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం బోనస్ విషయంలో ఆలోచించి సన్నవడ్లకే కాకుండా దోడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలని కోరారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులను రైతులు గ్రామాల్లో నిలదీస్తారని అన్నారు. తడిసిన ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

Related posts