ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత రేవంత్ పార్టీ మారుతారు: కేటీఆర్
హనుమకొండ మే 22 (ప్రజాక్షేత్రం): సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత పార్టీ మారుతారని.. ఆయనకు అనుకూలంగా ఉండే బీజేపీలోకి వెళ్తారని బీఆర్ఎప్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సంచలన ఆరోపణలు చేశారు. హనుమకొండలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ప్రజలు గోస పడుతున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తామని చెప్పారని… ఇచ్చిన హామీలు అమలు చేయటంలో ఘోరంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. కేసీఆర్ రైతు బంధు ఇచ్చి రైతులకు అండగా నిలిచారని.. కానీ ఓట్ల కోసమే రేవంత్ రైతుబంధు వేస్తున్నారని ఆరోపించారు. విద్యావంతుల పక్షాన కొట్లాడే వారిని పట్టభద్రుల ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పరిశ్రమలు తెస్తే…. కాంగ్రెస్ హయాంలో వెనక్కి పోతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న లాంటి వారికి ఓటుతో ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పాలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని.. గెలిపిస్తే పట్టభద్రుల సమస్యలపై పోరాడుతారని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నోటిఫికేషన్‌లు ఇస్తానని చెప్పి నిరుద్యోగులను నిలువునా మోసం చేశారని విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలను.. తమ గొప్పలు అని చెబుతూ రేవంత్ ఊదరగొడుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.