Praja Kshetram
తెలంగాణ

ఇసుకను తోడేస్తున్నారు..

ఇసుకను తోడేస్తున్నారు..

-యథేచ్ఛగా ఇసుక అక్రమ దందా

– చిన్నచిన్న వాగులు, వంకలను వదలని మాఫియా

– అడుగంటుతున్న భూగర్భ జలాలు

– మామూళ్ల మత్తులో అధికారులు

ఆసిఫాబాద్‌ మే 22 (ప్రజాక్షేత్రం): జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. నిబంధనలకు పాతరేసి అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఫలితంగా వాగులు, వంకలన్నీ వట్టిపోయి భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. జిల్లాలో ఎలాంటి ఇసుక రీచ్‌లు లేక పోయినా ట్రాక్టర్ల యజమానులు నామమాత్రంగా పర్మిట్‌లు తీసుకుంటూ ఒక్కో పర్మిట్‌పై పదేసి ట్రిప్పుల చొప్పున ఇసుకను తరలిస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాల వ్యవహారంలో తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు రెవెన్యూ, పోలీసుల పాత్ర అపరిమితంగా ఉన్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ముఖ్యంగా ట్రాక్టర్‌ యజమానుల నుంచి ఒక్కో ట్రాక్టర్‌కు నెలకు రూ.2వేల చొప్పున వసూలు చేస్తూ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా జిల్లా కేంద్రంతో సహా 15మండలాల్లోనూ ఇంచుమించు ఇదే తరహాలో మాఫియా దర్జాగా ఇసుక దోపిడీకి పాల్పడుతోంది. నిర్మాణ రంగం ఊపందుకుంటున్న పరిస్థితుల్లో ఇసుకకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడడంతో వ్యవసాయ అవసరాల కోసం వినియోగించాల్సిన ట్రాక్టర్‌లను సైతం ఇసుక దందాకే వినియోగించడం పరిస్థితి తీవ్రతకు దర్పణం పడుతోందని చెప్పవచ్చు. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో జిల్లా నుంచి పొరుగు జిల్లాలకు ఇసుక అక్రమంగా రవాణా అవుతున్న అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రజాప్రతినిధులు మండిపడటం ఇందుకు నిదర్శనం.

జిల్లాలో యథేచ్ఛగా అక్రమ ఇసుక దందా..

జిల్లాలోని రెండు నియోజకవర్గాల పరిధిలో ఇసుక స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా అధికారుల అండదండలు ఈ అక్రమ వ్యాపారం వెనక పుష్కలంగా ఉన్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ముఖ్యంగా ఆసిఫాబాద్‌ పట్టణశివారులోని పెద్దవాగు మొదలుకుని దహెగాం మండలంలోని ఎర్రవాగు వరకు నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకున్న ఇసుక చోరులు మాఫీయాను తలదన్నే రీతిలో ఏకంగా ఎక్స్‌కావేటర్‌లు, డోజర్లు వంటి యంత్ర సామగ్రిని ఉపయోగించి మరీ ఇసుక వ్యాపారానికి తెరలేపడం అధికారుల పనితీరును ప్రశ్నార్థకంగా మార్చి వేసింది. వాస్తవానికి జిల్లాలో అధికారికంగా ఎలాంటి ఇసుక రీచ్‌లు గుర్తించలేదు. కానీ జిల్లాలో ఇబ్బడి ముబ్బడిగా ఉన్న వాగులు, వంకల ద్వారా ఉన్నా పోగయ్యే స్వల్ప పరిమాణం ఇసుక మేటలను కూడా వ్యాపారులు తరలిస్తున్నప్పటికీ రెవెన్యూ, భూగర్భ జలవనరులశాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మార్కెట్‌లో ప్రస్తుతం టన్ను ఇసుకకు రూ.2000నుంచి రూ.2500 వరకు ధర పలుకుతోంది. నిబంధనల ప్రకారం లారీలలో ఇసుక తరలించరాదన్న ఆదేశాల దృష్ట్యా అక్రమ ఇసుక తవ్వకం దారులు వ్యూహాత్మకంగా రూట్‌ మార్చి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను రహస్య ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న డంప్‌లకు తరలించి అక్కడి నుంచి లారీల్లో ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇలా జిల్లాలో రెబ్బెన మండలంలోని గంగాపూర్‌, పులికుంట, కొండపల్లి వాగులతో పాటు దహెగాం మండలంలోని కల్వాడ ఎర్రవాగు, పెద్దవాగు, కౌటాల మండలంలోని ముత్తంపేట, తాట్‌పల్లి వాగులు, చింతలమానేపల్లి మండలంలోని రుద్రాపూర్‌, చింతలమానేపల్లి, కాగజ్‌నగర్‌ మండలంలోని రాస్పెల్లి, పెద్దవాగు, కెరమెరి మండలంలోని సాంగ్వీ, కైరి వాగు, సిర్పూర్‌(టి) మండలంలోని పెద్దబండ వాగుల నుంచి ఇసుక మాఫియా పెద్దఎత్తున ఇసుకను వెలికితీస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారమంతా సంబంధిత తహసీల్దార్‌లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లకు తెలిసినప్పటికీ ఇసుక సిండికేట్లు ముట్ట చెప్పే మామూళ్లకు ఆశపడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారుల పనితీరుపై ఆరోపణలు ఎక్కువ అయిన సమయాల్లో మాత్రం ఒకటి రెండు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నట్లు చెబుతున్నారు.

భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం..

జిల్లా భౌగోళికంగా అనేక వైరుధ్యాలతో కూడుకొని ఉన్న ప్రాంతం కావడంతో జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల స్థితి అసమతుల్యంగా ఉంటుంది. వర్షాకాలంలో పుష్కళంగా కనిపించే భూగర్భజలాలు ఎండాకాలంలో పాతాళానికి చేరుతూ ఏటా మనుషులకే కాకుండా పశుపక్షాదులు, జంతువులకు తాగునీటి సమస్య ఉత్పన్నం కావడం ఇక్కడ సర్వసాధారణం. సందేట్లో సడేమియాలా వాగులు వంకల్లో అడ్డగోలుగా సాగుతున్న ఇసుక తవ్వకాల మూలంగా ఉన్న కొద్దిపాటి భూగర్భజలాల మట్టం కూడా దారుణంగా పడిపోతున్నట్లు భూగర్భ జలవనరుల శాఖ సేకరించిన సర్వేల్లో వెల్లడైంది. ముఖ్యంగా వాగులు, ఒర్రెలు ప్రవహిస్తున్న పరిసరాల్లో భూగర్భ జలాలపై ఇసుక తవ్వకాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని గిరిజన గ్రామాలు, గూడాల్లో తీవ్ర తాగునీటి సంక్షోభం తలెత్తుతున్నట్లు గుర్తించారు. నిబంధనల ప్రకారం నదులు, ఉపనదుల్లోనే మీటర్‌ లోతుకు మించి ఇసుక తవ్వకాలు జరపడం నిషేధం. వాల్టా చట్టాన్ని అనుసరించి వాగులు, వంకల్లో అసలు ఇసుక తీయరాదు. కానీ జిల్లాలో అడుగడుగున నిబంధనలు తుంగలో తొక్కుతూ అక్రమంగా ఇసుక దందా సాగుతుండడంతో భూగర్భ జలాలపై తీవ్రప్రభావం చూపుతున్నట్లు చెబుతున్నారు. మరీముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో ఇసుక తవ్వకాల వల్ల నీటి వనరులన్నీ కూడా ఆవిరైపోయి వన్యప్రాణులకు తాగునీరు లభించని పరిస్థితి ఉత్పన్నం అవుతోంది. దీంతో నీటి కోసం అటవీ జంతువులు కాస్త గ్రామాలపై పడి రైతుల ఆస్థి, ప్రాణనష్టాలకు కారణంగా నిలుస్తున్నాయి.

Related posts