Praja Kshetram
తెలంగాణ

అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ, ఉక్కుపాదం.. భారీ భవనాల కూల్చివేత

అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ, ఉక్కుపాదం.. భారీ భవనాల కూల్చివేత

రంగారెడ్డి జిల్లా మే 23 (ప్రజాక్షేత్రం): నార్సింగి మున్సిపాల్టీలోని అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ ఉక్కుపాదం మోపింది. కోకాపేట గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాలను హెచ్ఎండీఏ, మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా భవన యజమానులు జీ ప్లస్ 3 అనుమతులు తీసుకొని ఆరు అంతస్థులు నిర్మించారు.గురువారం ఉదయం నుంచి అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. అయితే భవన యజమానులు మున్సిపల్, హెచ్ఎండీఏ అధికారులను అడ్డుకున్నారు.దీంతో అధికారులతో నిర్వాహకులు వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు.

నార్సింగి మున్సిపాల్టీ పరిధిలో తప్పకుండా అనుమతులు తీసుకోవాలని సూచిస్తున్నారు. మున్సిపాల్టీలో దరఖాస్తు చేసుకున్న తర్వాత అనుమతి పొందిన తర్వాత నిర్మాణాలు చేపట్టుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. అనుమతులు తీసుకోకుండా కట్టిన భవనాలను కూల్చివేస్తామని ఆయా నిర్వాహకులకు అధికారులు వార్నింగ్ ఇచ్చారు. అయితే ప్రభుత్వ ఆదాయానికి గండిపడేలా రెండు, మూడు ఫ్లోర్లకు అనుమతి తీసుకొని కొంతమంది నిబంధనలకు విరుద్ధంగా ఆరు నుంచి ఏడు అంతస్థుల భవనాలను నిర్మిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అధికారులు గురువారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఫిర్యాదులు రావడంతో ప్రస్తుతం నార్సింగి పరిధిలో నాలుగు, ఐదు భవనాలను కూల్చివేశారు. మరో రెండు రోజుల పాటు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోందని హెచ్ఎండీఏ, మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఈ నిర్మాణాలను కూల్చివేస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి భవన నిర్మాణదారులు కూల్చివేతలను అడ్డుకుంటున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో నిర్మాణాల చుట్టూ పోలీసులు మోహరించారు.

Related posts