జగన్ నీకు సిగ్గుందా.. ఆడబిడ్డల ఉసురు తగులుతుంది.. షర్మిల సంచలన వ్యాఖ్యలు
అమరావతి మే 24 (ప్రజాక్షేత్రం): సీఎం జగన్‌పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో షర్మిల కడప ఎంపీగా పోటీచేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో గెలుపుపై షర్మిల భారీ ఆశలు పెట్టుకున్నారు. జగన్ తనకు సొంత అన్న అయిండి వైఎస్సార్సీపీ కేడర్‌తో అసభ్యంగా తిట్టించారని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఏపీలోని ఓ పాఠశాలలో 13 ఏళ్ల బాలికపై ఆమె సీనియర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డారు.ఈ ఘటనను ఉద్దేశిస్తూ షర్మిల ఈరోజు (శుక్రవారం) ఎక్స్(ట్విట్టర్) వేదికగా సీఎం జగన్‌పై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
*ఆడబిడ్డలకు రక్షణేది..?*
‘‘జగన్ నీకు సిగ్గుందా.. ఆడబిడ్డల ఉసురు తగులుతుంది. నా అక్కలూ, నా చెల్లెమ్మలు, నా తల్లులూ, నా అవ్వలూ అంటూ జబ్బలు చరిచి.. మైకుల ముందు గొంతు చించుకుని మొసలి కన్నీరు, ఫేక్ ప్రేమలూ నటించే ముఖ్యమంత్రి గారు.. మన రాష్ట్రంలో, మీ పాలనలో మహిళల భద్రతకు, బతుకులకు పట్టిన పీడా, దేశమంతా చెప్పుకుంటోంది. లండన్ వీధుల్లో పొర్లుదండాల మధ్య విహరిస్తున్న మీకు, ఇక్కడి ఆర్తనాదాలు, హాహాకారాలు వినపడవు. రాష్ట్రానికి ఈ అత్యున్నత ర్యాంకులు మీ వల్ల రావు. మీరు, మీ మహిళా మంత్రులు, నాయకురాళ్లు సిగ్గుతో తలవంచుకుంటారో…సిగ్గులేకుండా మిన్నకుండిపోతారో ప్రజలు గమనిస్తున్నారు’’ అని షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.