Praja Kshetram
తెలంగాణ

అదంతా అందెశ్రీ ఇష్టం.. కీరవాణితో నాకేం సంబంధం..!?

అదంతా అందెశ్రీ ఇష్టం.. కీరవాణితో నాకేం సంబంధం..!?

 

న్యూఢిల్లీ మే 28 (ప్రజాక్షేత్రం): తెలంగాణలో రాచరిక వ్యవస్థకు తావులేదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలని, చిహ్నాలని.. అందుకే తెలంగాణ తల్లి, గీతం స్పురించేలా రాష్ట్రం చిహ్నం ఉంటుందని రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన బాధ్యతలు అందె శ్రీకి ఇచ్చామని, అందె శ్రీ ఎవరిని ఎంచుకుని గేయ రూపకల్పన చేస్తారనేది ఆయన ఇష్టమన్నారు. ఏ సంగీత దర్శకుడిని పెట్టి గేయ రూపకల్పన చేయాలనేది తనపనికాదన్నారు. రాష్ట్ర గేయ రూపకల్పన బాధ్యత అంతా అందె శ్రీ దేనని.. ఇక తెలంగాణ చిహ్న రూపకల్పన నిజామాబాద్ వ్యక్తికి ఇచ్చామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కీరవాణి వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని క్లియర్ కట్‌గా చెప్పేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం మీడియాతో చిట్ చాట్‌‌లో రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

*తేల్చాల్సిందే..?*

మేడిగడ్డ ప్రాజెక్టు వెన్నెముక ఇరిగిందని తాను ముందే చెప్పానని, గత ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి విడిచిందని, సముద్రంలో పోసిన నీళ్లకు కరెంట్ బిల్లు కట్టమని చెప్పారు. ఎన్నికల కోడ్ రాష్ట్రంలో ఉన్నందున ఫోన్ టాపింగ్‌పై సమీక్ష జరపలేదన్నారు. ఫోన్ టాపింగ్ అంశం అధికారులు చూసుకుంటున్నారని, దానితో తనకు ఎలాంటి సంబంధం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హార్డ్ డిస్కులను ధ్వంసం చేశారని, అన్నింటిపై సీబీఐ విచారణ అడిగే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ఫోన్ టాపింగ్‌పై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తాను ఫోన్ ట్యాపింగ్ చేయించడం లేదని, అలాంటి పనులు చేయనని స్పష్టం చేశారు. బ్యాకప్ డేటాకు సంబంధించిన హార్డ్ డిస్కులు ఫామ్ హౌస్‌లో ఉన్నాయో.. ఇంకా ఎక్కడ ఉన్నాయో విచారణ అధికారులు తేల్చాలని ముఖ్యమంత్రి అన్నారు.
రాష్ట్రంలో విద్యుత్ సమస్య, కోతలు లేవని, కొన్ని చోట్ల వర్షాల కారణంగా సదుపాయాలలో అవంతరాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పక్క రాష్ట్రంలో పోలీసు అధికారులందరినీ కూడా ఎన్నికల సమయంలో ట్రాన్సఫర్ చేశారని, తెలంగాణలో ఎలాంటి ట్రాన్సఫర్‌లు లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు ఎలాంటి ఆరోపణలు చేయకుండా ఎన్నికలు జరిగాయని, స్వేచ్ఛాయుత వాతావరణంలో రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించామన్నారు. ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం చేశామని ప్రతిపక్షాలు సైతం ఆరోపణలు చేయలేదన్నారు. కాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ అవతరణ దినోత్సవం కార్యక్రమానికి హాజరుకావాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీకి ఆహ్వానం పంపించారు.

Related posts