Praja Kshetram
తెలంగాణ

గాజా మారణహోమానికి వ్యతిరేకంగా గొంతెత్తుదాం.!

గాజా మారణహోమానికి వ్యతిరేకంగా గొంతెత్తుదాం.!

*ఉస్మానియా యూనివర్సిటీలో పిడిఎస్యు, పివైఎల్ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు..!!*

ఉస్మానియా యూనివర్సిటీ మే 29 (ప్రజాక్షేత్రం): గాజాలో ఇజ్రాయిల్ చేస్తున్న మారణహోమానికి వ్యతిరేకంగా ప్రజలు,ప్రజాస్వామికవాదులు గొంతెత్తాలని ఐఎఫ్టీయు జాతీయ ఉపాధ్యక్షులు పి.ప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీ.డీ.ఎస్.యు), ప్రగతిశీల యువజన సంఘం(పివైఎల్) రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సును నిర్వహించారు. దీనికి ప్రధాన వక్తలుగా సామాజిక, రాజకీయ కార్యకర్త సారా మాథ్యూస్ మరియు ఐఎఫ్టియు జాతీయ ఉపాధ్యక్షులు పి.ప్రసాద్ హాజరై మాట్లాడుతూ ఇజ్రాయిల్ పాలస్తీనా ప్రజల జాతి ఆకాంక్షలను అణచివేస్తూ, పాలస్తీనాపై బాంబు ,వైమానిక దాడులు చేస్తూ మారణ హోమాన్ని సృష్టిస్తున్నారన్నారు. ఇజ్రాయిల్ దురాక్రమిత దాడుల్లో పాలస్తీనా వైద్యులు చంపబడ్డారని, హాస్పిటల్స్,పాఠశాలలు, కళాశాలలు,లైబ్రరీలు, విశ్వవిద్యాలయాలు బాంబు దాడులలో ధ్వంసమై శిథిలాలుగా మిగిలాయన్నారు.ఇదిలా ఉండగా ఇజ్రాయిల్ తన దురాక్రమనను యదేచ్ఛగా సమర్ధించుకుంటున్నట్లు ,తమరక్షణ కొరకే పాలస్తీనా ప్రజల పై దాడులు చేస్తున్నామని ఇజ్రాయిల్ చెప్పడం అంటే ప్రపంచ శాంతిని ప్రత్యక్షంగా ధ్వంసం చేయడమేనని, వీరి అసలు లక్ష్యం పాలస్తీనా ప్రజలను నిర్మూలించడమే అని స్పష్టం చేశారు.
గాజాలో ఇప్పటివరకు దాదాపు ముప్పై అయిదు వేల మంది,ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ లో ఇజ్రాయిల్ సాయుధ బలగాలచే వందలాది మంది పాలస్తీనియన్లు చంపబడ్డారనీ ఆవేదన వ్యక్తం చేశారు.ఆధునిక చరిత్రలో ఇది అతి పెద్ద మారణహోమమని, ఇది నేటికీ కొనసాగడం అత్యంత విషాదకరం అన్నారు. అదే విధంగా పి.డి.ఎస్.యు రాష్ట్ర మాజీ అధ్యక్షులు, జార్జి మిత్రులు బూర్గుల ప్రదీప్ మరియు ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్ మాట్లాడుతూ ఈ మారణహోమం ద్వారా అమెరికా కంపెనీలు ఆయుధాలు సరఫరా చేసి ఆర్థికంగా లాభపడుతున్నాయన్నారు.
నేడు గాజాలో మరణించిన ప్రజలకు సామూహిక ఖననాలు జరుగుతున్నాయనీ ఎప్పుడు, ఎక్కడ ఎలా ఉపదృవం ముంచుకొస్తుందో, ఇంకా ఎన్ని వేల మంది మరణిస్తారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు.ఈ మారనహోమానికి వ్యతిరేకంగా నిలబడాల్సిన భారత ప్రభుత్వం సరైన విధానాన్ని అవలంబించడం లేదని,ఇజ్రాయిల్ దురాక్రమణకు మద్దతిస్తుందని దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. గాజా ప్రజలు చేస్తున్న జాతి పోరాటానికి మద్దతు తెలుపుతున్నట్లు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పీడీఎస్.యు, పివైఎల్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మహేష్, సాగర్, శ్రీకాంత్, కోల లక్ష్మీనారాయణ, పి ఓ డబ్ల్యు రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ, విద్యార్థి యువజన సంఘాల నాయకులు గౌతమ్ కుమార్, శ్రీకాంత్ , గొర్రెపాటి రమేష్, రవి, మస్తాన్, తిరుపతి,చరణ్, శ్రీనివాస్, సంతోష్ ,కార్తీక్ ,పవన్,పుష్ప,సంతోష,ఆసియా తదితరులు పాల్గొన్నారు.

Related posts