అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు
సీఎం.. సీఎం అంటూ అభిమానులు నినాదాలు
హైదరాబాద్ మే 29 (ప్రజాక్షేత్రం): ఏపీలో పోలింగ్ జరిగిన తర్వాత అమెరికా వెళ్లిన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం హైదరాబాద్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో టీడీపీ నేతల, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఏపీలో పోలింగ్ జరిగిన తర్వాత చంద్రబాబు దంపతులు విదేశాలకు వెళ్లారు. అమెరికా టూర్ పూర్తి కావడంతో వారు స్వదేశానికి చేరుకున్నారు. జూన్ 4న కౌంటింగ్ ఉండడంతో చంద్రబాబు ఆ అంశంపై ఫోకస్ పెట్టనున్నారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మూడు నెలలపాటు విరామం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 114 నియోజక వర్గాల్లో పర్యటించిన చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరీక్షల కోసం ఆయన అమెరికా వెళ్లారు. కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు విదేశాలకు వెళ్లిన చంద్రబాబు.. అక్కడి నుంచి కూడా పార్టీ నేతలతో ఫోన్‌లో మాట్లాడి.. పరిస్థితులను తెలుసుకున్నారు. పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలలో జరిగిన సంఘటనలకు సంబంధించి టీడీపీ శ్రేణులు ఏ విధంగా వ్యవహిరించలి అనే అంశంపై దిశ నిర్దేశం చేశారు. ఆరోగ్య పరీక్షలు పూర్తి అయిన అనంతరం ఈ రోజు ఉదయం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి జూబ్లీహిల్స్ నివాసానికి బయలుదేరారు. బుధవారం సాయంత్రంగానీ, గురువారం ఉదయం గానీ చంద్రబాబు అమరావతికి రానున్నారు.