తెలంగాణలో పార్టీ పునఃనిర్మాణానికి చంద్రబాబు చర్యలు ఫలించేనా..?
హైదరాబాద్ మే 31 (ప్రజాక్షేత్రం) : తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునఃనిర్మాణం దిశగా పార్టీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని తన నివాసంలో పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4గంటలకు జరిగే ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నేతలకు ఇప్పటికే ఆహ్వానం అందింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణలో టీడీపీ అంత చురుకుగా లేదు. అయితే పార్టీకి పునర్ వైభవం తెచ్చేందుకు చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారు. కొంతకాలంగా తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. పునఃనిర్మాణంలో భాగంగా ముందుగా కొత్త అధ్యక్షుడి నియామకంపై చర్చ జరిగే అవకాశం ఉంది. దీనిపై ముఖ్య నేతలతో చర్చించనున్నారు. రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తుపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. హైదరాబాద్‌లో జరిగే సమావేశానికి ఇప్పటికే పలువురు నేతలు పెద్దఎత్తున చంద్రబాబు నివాసానికి చేరుకున్నట్లు సమాచారం. చర్చల అనంతరం రాష్ట్రంలో టీడీపీ ఎలా ముందుకు సాగుతుందో వేచి చూడాల్సిందే.