ఐటీ దాడులు…రికార్డు స్థాయిలో రూ.1,100 కోట్లు పట్టివేత
న్యూఢిల్లీ మే 31 (ప్రజాక్షేత్రం): ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఆదాయం పన్ను శాఖ జరిపిన దాడుల్లో రికార్డు స్థాయిలో రూ.1,100 కోట్లు విలువచేసే నగదు, ఆభరణాలు పట్టుబడ్డాయి. 2019లో రూ.390 కోట్లు పట్టుబడగా, దానికంటే182 శాతం అధికంగా ఈసారి నగదు పట్టుబడింది. మే 30వ తేదీ వరకూ పట్టుబడిన సొమ్ము దాదాపు రూ.1100 కోట్లు విలువ చేస్తుందని ఆదాయం పన్ను వర్గాలు తెలిపాయి.
*టాప్‌లో కర్ణాటక*
ఐటీ దాడుల్లో అత్యధికంగా పట్టుబడిన రాష్ట్రాల్లో కర్ణాటక అగ్రస్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో రూ.200 కోట్లు విలువచేసే నగదు, ఆభరణాలు పట్టుబడ్డాయి. తమిళనాడు రూ.150 కోట్లతో రెండో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాలో పట్టుబడిన సొమ్ము రూ.100 కోట్లకు పైమాటే.
భారత ఎన్నికల కమిషన్ లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించిన మార్చి 16వ తేదీ నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. అప్పట్నించి ఓటర్లను ఆకర్షించేందుకు నాయకులు వివిధ రీతిల్లో సరఫరా చేసే మద్యం, నగదు, ఉచితాల పంపిణీ మార్గాలపై ఆదాయం పన్ను అధికారులు గట్టి నిఘా వేశారు. అక్రమార్కులపై కొరడా ఝళిపించేందుకు ప్రతి రాష్ట్రంలోనూ 24 గంటలూ పనిచేలా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.