10 ఏళ్ల రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు గవర్నర్‌కు ఆహ్వానం
హైదరాబాద్ జూన్ 1 (ప్రజాక్షేత్రం): తెలంగాణ 10 ఏళ్ల ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాజ్ భవన్ వెళ్లి రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రావాలని గవర్నర్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పూల బోకే ఇచ్చి మర్యాద పూర్వకంగా ఆహ్వానించారు. మరోవైపు ఈ కార్యక్రమానికి ఇప్పటికే సోనియా గాంధీని కూడా ఆహ్వానించారు. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఈరోజు చివరి రోజు అని చెప్పవచ్చు. ఎందుకంటే జూన్ 2న ‘అపాయింటెడ్ డే’ నాడు ఇది తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే రాజధానిగా ఉంటుంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్నాయి. దీంతోపాటు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు ప్రకటించారు. ఈ ఆంక్షలు శనివారం ఉదయం నుంచి ఆదివారం రాత్రి 12 గంటల వరకు కొనసాగుతాయని వెల్లడించారు.