Praja Kshetram
తెలంగాణ

సొంత జిల్లాలో సీఎం రేవంత్‌కు ఎదురుదెబ్బ.. మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌ ఘన విజయం

సొంత జిల్లాలో సీఎం రేవంత్‌కు ఎదురుదెబ్బ.. మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌ ఘన విజయం

 

మహబూబ్‌నగర్‌ జూన్ 2 (ప్రజాక్షేత్రం) : మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి నవీన్‌కుమార్‌ రెడ్డి 111 ఓట్ల మెజార్టీతో విజదుందుభి మోగించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలుపొందడం విశేషం. దీంతో సొంత జిల్లాలో సీఎం రేవంత్‌ రెడ్డికి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. తిరిగి తమ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబురాలు చేసుకుంటున్నారు. మొత్తం 1,437 ఓట్లు పోలవగా అందులో 21 ఓట్లు చెల్లనివిగా నిర్ధారించారు. మిగిలిన 1,416 ఓట్లలో బీఆర్ఎస్‌కు 763, కాంగ్రెస్ అభ్యర్థికి 652 ఓట్లు వచ్చాయి.ఉమ్మడి జిల్లా స్థానిక ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీగా ఉన్న కశిరెడ్డి నారాయణరెడ్డి గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మారడం.. కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో మార్చి 28న ఎన్నికలు నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ తరఫున నవీన్‌కుమార్‌ రెడ్డి పోటీ చేయగా, కాంగ్రెస్‌ పార్టీ నుంచి మన్నె జీవన్‌ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్‌ బరిలో నిలిచారు. ఈ పోటీకి బీజేపీ దూరంగా ఉన్నది. మొత్తం 1437 మంది ఓటుహక్కు వినియోగించుకోగా, ఇద్దరు ఎంపీటీసీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

Related posts