నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం.. వైద్యం వికటించి గర్భిణి మృతి
నాగర్‌కర్నూల్ జూన్ 2 (ప్రజాక్షేత్రం): నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పురిటినొప్పులతో వచ్చిన ఏడు నెలల ఓ గర్భిణికి సూది మందు ఇచ్చారు. ఆ మందు వికటించి మహిళ మృతి చెందిన ఘటన ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రియాంక హాస్పిటల్‌లో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాడూర్ మండల కేంద్రానికి చెందిన మహేందర్, పద్మ (36) వీరికి ఒక కూతురు ఉంది. అయితే పద్మ రెండో సారి గర్భం దాల్చి 7 నెలలు కావడంతో నొప్పులు వస్తున్నాయి జిల్లా కేంద్రంలోని ప్రియాంక హాస్పిటల్‌లో ఆదివారం ఉదయం వెళ్లారు. దవాఖానలో డాక్టర్ లేకపోవడంతో అందులో పని చేసే నర్సులు స్కానింగ్ చేసి ఇంజెక్షన్స్ ఇచ్చారు. కొద్దిసేపటికి పరిస్థితి విషమించడంతో జిల్లా హాస్పిటల్‌కు తీసుకువెళ్లాలంటూ బాధితులకు నర్సులు చెప్పారు.అంతలోనే గర్భిణి మృతి చెందింది. దీంతో హాస్పిటల్ వర్గాల నిర్లక్ష్యంతోనే మహిళ మృతి చెందిందని బంధువులు హాస్పిటల్ ముందు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.