ఆలంఖాన్ గూడ అంగన్వాడీ కేంద్రంలో కుళ్ళిపోయిన గుడ్లు పంపిణీ…
శంకర్ పల్లి జూన్ 04 (ప్రజాక్షేత్రం): గర్భిణీ స్త్రీలకు పిల్లలకు బాలింతలకు పౌష్టికాహారం కోసం బాలామృతం పథకం ద్వారా ప్రభుత్వం కోడిగుడ్లను పంపిణీ చేస్తుంది. కొన్ని ఏజెన్సీల ద్వారా అంగన్వాడి కేంద్రాలకు కోడిగుడ్లను ప్రభుత్వం సరఫరా చేస్తుంది. అయితే మంగళవారం రోజున శంకర్ పల్లి మండల పరిధిలోని ఆలంఖాన్ గూడ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నపిల్లలకు గుడ్లను పంపిణీ చేశారు. వాటిని ఇంటికి తీసుకు వెళ్లిన లబ్ధిదారులు వాటర్ లో గుడ్లను వేసి చూడగా అవి పైకి తేలడం గమనించిన లబ్ధిదారులు వాటిని పగలగొట్టి చూడగా వాటి నుండి దుర్వాసన, అవి కుళ్లిపోయి ఉండడం గమనించిన లబ్ధిదారులు వాటిని ఫోటోలు, వీడియోలు తీశారు. ఒకవేళ ఇవి మేము గమనించకుండా వీటిని మా పిల్లలు తింటే మా పిల్లలకు ఏమైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యతులు అని ప్రశ్నించారు?
దీనిపైన సంబంధిత అధికారులు అందించి గుడ్లు సరఫరా చేసే ఏజెన్సీలు నాణ్యమైన గుడ్లు సరఫరా చేయకపోవడం వలన లేక అంగన్వాడి కేంద్రాల్లో నిల్వ ఉంచడం వలన అనే దాని పైన అధికారులు సందర్శించి చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఇప్పటికైనా నాణ్యమైన గుడ్లను పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై చేవెళ్ల సిడిపివో శోభారాణిని వివరణ కోరగా అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి వివరాలు సేకరించాలని సంబంధిత సూపర్వెజర్ ను ఆదేశించడం జరుగుతుందని తెలిపారు. నాసిరకమైన కుళ్ళిన గుడ్లు పంపిణీ చేసినట్లు తెలిస్తే సరఫరా చేస్తున్న ఏజెన్సీ పై ఉన్నతాధికారుల ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.