బీజేపీ గెలుపులో ఎమ్మార్పీఎస్ కీలక పాత్ర ..
హైదరాబాద్ జూన్ 4 (ప్రజాక్షేత్రం):లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అభ్యర్థన మేరకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ బిజెపి అభ్యర్థుల గెలుపుకు చేసిన కృషి ఈ పార్లమెంట్ ఎన్నికలలో కీలకమైంది. దాంతో పలుచోట్ల బిజెపి ఎంపీ అభ్యర్థులు విజయం సాధించారు. గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అధికారంలో ఉన్న ప్రతి పార్టీని, ప్రతిపక్ష పార్టీల నాయకులను అభ్యర్థిస్తూనే ఉన్నారు. అయితే ఆయా పార్టీల పెద్దలు మందకృష్ణ మాదిగ సేవలు వినియోగించుకుంటూ, ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీలు ఇస్తూ ఇప్పటివరకు కాలయాపన చేస్తూనే ఉన్నారు. కానీ ఏ ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణ చేయలేకపోయింది. దాంతో గత కొన్ని నెలల క్రితం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో విశ్వరూప మహాసభ నిర్వహించారు. ఈ సభకు లక్షలాదిమంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నాయకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఇదే సభకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరయ్యారు. జన ప్రభంజనం చూసిన ప్రధాని నరేంద్ర మోడీ తాము మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామని మందకృష్ణ మాదిగకు హామీ ఇచ్చారు. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి అభ్యర్థులకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు ప్రకటించి వారి విజయానికి కృషి చేయాలని ప్రధాని కోరారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని ప్రధాని మాట ఇచ్చిన సందర్భంగా మందకృష్ణ మాదిగ బిజెపి పార్టీ అభ్యర్థుల విజయానికి తాము కృషి చేస్తామని ప్రకటించారు. దాంతో ఆయన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బిజెపి అభ్యర్థులు పోటీ చేస్తున్న ఆయా నియోజకవర్గాల్లో ఆయన స్వయంగా వెళ్లి అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బిజెపి పార్టీని ఆదరించాలని ఆయా పార్టీల ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఆయన చేసిన ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, డికె అరుణ, గోడం నగేష్, ఎంపీలుగా విజయం సాధించారు. బిజెపి, కాంగ్రెస్ రాష్ట్రంలో నువ్వా నేనా అన్నట్లు పోటీపడిన సందర్భంలో బిజెపి అభ్యర్థుల విజయానికి ఎమ్మార్పీఎస్ మద్దతు కీలకంగా మారి సులువుగా విజయం సాధించారు. బిజెపి పార్టీ కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్ ఎత్తివేస్తారని అలాంటి పార్టీకి ఎలా మద్దతిస్తారని మందకృష్ణ మాదిగను ఎందరో ప్రశ్నించారు. అలాంటి ప్రశ్నలకు మందకృష్ణ మాదిగ చిరునవ్వుతో సమాధానం ఇస్తూ భవిష్యత్తు గురించి తనదైన స్టైల్ లో వివరించారు. ఏది ఏమైనా బిజెపి అభ్యర్థుల విజయానికి ఇచ్చిన మాటకు అనుగుణంగా సహకరించిన మందకృష్ణ మాదిగ మరి ప్రధాని నరేంద్ర మోడీకి ఎస్సీ వర్గీకరణ చేయాలని అభ్యర్థించిన ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటారో? లేదో వేచి చూడాల్సిందే.