Praja Kshetram
తెలంగాణ

బీఆర్ఎస్ రాష్ట్రంలో బీజేపీకి బీ పార్టీ లా వ్యవహరించింది

రఘురాంరెడ్డిది ఆల్ టైం రికార్డు

 

– ఇంతటి మెజారిటీని అందించిన ప్రజలకు రుణపడి ఉంటాం

– ఉభయ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ శ్రేణుల కృషి మరువలేనిది

– బీఆర్ఎస్ రాష్ట్రంలో బీజేపీకి బీ పార్టీ లా వ్యవహరించింది

– రెండు మూడు రోజుల్లో దేశ రాజకీయాలు మలుపు తిరగడం ఖాయం

– కాంగ్రెస్ ఎంపీ విజయానంతరం కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియాతో మంత్రి పొంగులేటి

 

 

ఖమ్మం జూన్ 4 (ప్రజాక్షేత్రం): ఖమ్మం లోక్ సభ ఎంపీగా రామ సహాయం రఘురాం రెడ్డి ని గతంలో ఎప్పుడూ కనీవిని ఎరుగని రీతిలో 4.67లక్షల ఆల్ టైం రికార్డు మెజారిటీని అందించిన ఉభయ జిల్లాల ప్రజలకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ వద్ద గల కిట్స్ కళాశాల లోని కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియా సమావేశంలో రఘురాంరెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తో కలిసి మాట్లాడారు. 18 వ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ఖమ్మం రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచిందని అన్నారు. ఖమ్మంలోని ఐదు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజక వర్గాల ఎమ్మెల్యేలు, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

ఖమ్మం పార్లమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి ఇంత మెజారిటీ ఎప్పుడూ రాలేదని అన్నారు. రాష్ట్రం లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది సీట్లు అందించారని, హైదరాబాద్ మొదటి నుంచి ఎంఐఎం సోదరులు గెలుస్తారనీ తెలిపారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల కంటే 1.67 శాతం అధికంగా ఓట్లు నమోదయ్యయని అన్నారు.

*బీఆర్ ఎస్, బీజేపీ ది అంతర్గత ఒప్పందం*

రాష్ట్రం లో బీఆర్ఎస్ డమ్మీ అభ్యర్థులను పెట్టి ఓట్లు బీజేపీకి పడేలా చేసిందని మంత్రి పొంగులేటి విమర్శించారు. అంతర్గతంగా చేసుకున్న ఒప్పందం తోనే 8 సీట్లు గెలవగలిగారని తెలిపారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక లో కూడా కాంగ్రెస్ అభ్యర్ధి ని గెలిపించినందుకు ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు.

*ప్రజాస్వామ్యాన్ని బతికించుకుందాం..*

ప్రజాస్వామ్యన్ని కాపాడుకోవాలి అంటే ఈ సారి ఇండియా కూటమి కి మద్దతు ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. రాబోయే రెండు, మూడు రోజుల్లో దేశ రాజకీయలు మలుపు తిరుగుతాయి అని అన్నారు.ఒంటరిగానే కేంద్రం లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న బీజేపీ వారి అహంకారానికి ప్రజలు పుల్ స్టాప్ పెట్టారని అన్నారు. దేశంలో ఎన్డీఏ కూటమిలో ఉన్న వారు మరోసారి పునరాలోచించాలని కోరారు.

Related posts