‘నందికొట్కూరు అభివృద్ధికి కృషి’
నందికొట్కూరు రూరల్, జూన్ 5 (ప్రజాక్షేత్రం): నందికొట్కూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి, నందికొట్కూరు టీడీపీ ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయబోమని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారిగా నందికొట్కూరు మండలంలోని అల్లూరు గ్రామంలో బుధవారం మాండ్ర నివాసంలో జయసూర్య విలేకరుల సమావేశం నిర్వహించారు. మాండ్ర మాట్లాడుతూ నందికొట్కూరు పట్టణంతో పాటు గ్రామాల్లో తాగు, సాగు నీరు అందించేందుకు కృషిచేస్తామన్నారు. టీడీపీ హయాంలో హంద్రీ నీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా రెండు ప్రత్యేక పంపులను ఏర్పాటుచేసి కేసీ కెనాలుకు నీరందించామన్నారు. అలాగే ఆరు ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తిచేయించామన్నారు. అలాగే క్రిష్ణా పుష్కరాల సమయంలో గ్రామాలకు రోడ్లు వేయించామన్నారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం, పోలవరం జాతీయ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు చంద్రబాబు ఎంతగానో శ్రమించారని గుర్తుచేశారు. జగన్ రాక్షస పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, దీంతో చంద్రబాబు వస్తేనే అభివృద్ధి సాధ్యమని భావించి టీడీపీకి పట్టం కట్టారని అన్నారు. ఎమ్మెల్యే జయసూర్య మాట్లాడుతూ తనను ఎమ్మెల్యేగా తనను గెలిపించిన ప్రజలకు, నాయకులు, కార్యకర్తలకు రుణపడి ఉంటానని, ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. నియోజకవర్గంలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా శాంతియుతంగా పాలన సాగిస్తామన్నారు. అలాగే నందికొట్కూరు మున్సిపాలిటీ పట్టణానికి గతంలో తాగు నీటికోసం మాండ్ర శివానందరెడ్డి కృషి వల్ల అలగనూరు రిజర్వాయర్ నుంచి రూ.120 కోట్లతో నీటినీ అందించేందుకు ప్రభుత్వం నుంచి పనులు కూడా మంజూరు చేయించారని, అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ పట్టించుకోలేదని వాపోయారు. కార్యక్రమంలో మాండ్ర సురేంద్రనాథరెడ్డి, పలుచాని మహేశ్వరెడ్డి, నారపురెడ్డి, లింగస్వామిగౌడు తదితరులు పాల్గొన్నారు.