ప్రకృతితో జీవనం మానవాళికి మనుగడ: ప్రగతి గ్రూప్ చైర్మన్ డాక్టర్ జిబికే రావు
శంకర్ పల్లి జూన్ 05 (ప్రజాక్షేత్రం): ప్రకృతిని ప్రేమిస్తూ, పరిరక్షిస్తూ, ప్రకృతితో కలిసి జీవనం సాగిస్తేనే మానవాళికి మనుగడ ఉంటుందని ప్రగతి గ్రూప్ చైర్మన్ డా.జిబికే రావు అన్నారు. బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శంకర్‌పల్లి మండల పరిధిలోని ప్రొద్దుటూరు గ్రామ శివారులో గల ప్రగతి రిసార్ట్స్ లో చైర్మన్ జిబికే రావు మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా చైర్మన్ పర్యావరణ ప్రేమికులు, ప్రజలకు తన సందేశమిచ్చారు. ప్రగతి రిసార్ట్స్ లో 450 రకాల వనమూలికల, ఔషధాల మొక్కలు ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలో ప్రత్యేకమైన శీతోష్ణస్థితి పరిస్థితులు కలిగి జీవించడానికి అనువైన భూమిని జాగ్రత్తగా కాపాడుకోవడం మన విధి అని గుర్తుచేశారు. విచక్షణ మరిచి మనిషి తన అవసరాలు తీర్చుకోవడమే లక్ష్యంగా సాగిస్తున్న కార్యకలాపాలు ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వృక్ష సంపదను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో ప్రగతి గ్రూప్ యండి అజయ్ చంద్ర, డైరెక్టర్ రామకృష్ణ, ఏవిపి వేణుగోపాల్, డా.రామారావు, సిబ్బంది పాల్గొన్నారు.