Praja Kshetram
జాతీయం

ఓటమి బాధ్యత నుంచి తప్పించుకునేందుకే సీఎం దుష్ప్రచారం

ఓటమి బాధ్యత నుంచి తప్పించుకునేందుకే సీఎం దుష్ప్రచారం

-ఆరు నెలల్లోనే ప్రజా వ్యతిరేకత ఎదుర్కోన్న కాంగ్రెస్ ప్రభుత్వం

-ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీని గుర్తిస్తున్న తెలంగాణ ప్రజలు

-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి

 

ఢిల్లీ జూన్ 06 (ప్రజాక్షేత్రం): పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సీట్లనే గెలవడంతో ఎక్కడ తన కుర్చీ కదిలిపోతుందేమోనన్న భయం, కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిలో పలుచనైపోతానన్న ఆందోళనతో ఓటమి బాధ్యత నుంచి తప్పించుకునేందుకే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో బీజేపీ సాధించిన విజయాలను తక్కువ చేసి మాట్లాడుతున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఢిల్లీలో మీడియాతో కిషన్‌రెడ్డి మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, దేశంలో బీజేపీ మళ్లీ వస్తే రిజర్వేషన్లు రద్ధు చేస్తుందని, రాజ్యాంగం మారుస్తుందని తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు.

అయినా ప్రజలు నమ్మకుండా కేంద్రంలో, తెలంగాణలో బీజేపీకి మెజార్టీ సీట్లు కట్టబెట్టారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లలో విజయం సాధించిందని, మరో 6 సీట్లలో రెండో స్థానంలో ఉన్నామని, అసెంబ్లీ సెగ్మెంట్‌ల వారిగా చూస్తే 47చోట్ల బీజేపీ మెజార్టీ ఓట్లు సాధించిందని, బీజేపీ ఓట్ల శాతం 35శాతానికి పైగా పెరిగిందని వెల్లడించారు. ఈ ప్రజాదరణ, గణంకాలు చూస్తే తెలంగాణలో కాంగ్రెస్‌, బీఆరెస్‌లకు ప్రత్యామ్నాయంగా ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని తేలిపోతుందన్నారు. అసెంబ్లీలో 8, లోక్ సభ ఎన్నికల్లో 8 స్థానాలను గెలిచామని వచ్చే శాసనసభ ఎన్నికల్లో 88 ఎమ్మెల్యే స్థానాలు గెలిచి అధికారంలోకి రాబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.

*ఓటమి బాధ్యత నుంచి తప్పుకునేందుకే దుష్పచారం.*

సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత రాజకీయ కారణాలతో పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఆదరించిన ప్రజాతీర్పును తప్పుగా చిత్రీకరిస్తూ బీఆరెస్ ఓట్ల బదిలీతో బీజేపీ గెలిచిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలే నిజమైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మెజార్టీ సాధించిన అనేక సెగ్మెంట్‌లలో ఆ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ ఎందుకు తగ్గిందో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన12స్థానాల్లో బీజేపీకి ఆధిక్యత వచ్చిందన్నారు.

కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందని అందుకే ఆ పార్టీకి చెందిన ఓటర్లు కూడా మాకే ఓటు వేశారన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం 35శాతం పెరిగితే కాంగ్రెస్ ఓట్ల శాతం కేవలం 1శాతం పెరిగిందన్నారు. ఓటమి బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు రేవంత్ రెడ్డి ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బెదిరింపులకు పాల్పడినా, కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తారని, రాజ్యాంగం మారుస్తారని తొండి ఆట ఆడినా ప్రజలు బీజేపీనే గెలిపించారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ సిట్టింగ్ సెగ్మెంట్ మల్కాజిగిరిలో, సీఎం సొంత జిల్లా మహబూబ్ నగర్ లోనూ మేమే గెలిచామని పేర్కోన్నారు.

*ఎమ్మెల్యేలు లేకపోయినా ఎంపీలను గెలిపించారు.*

చాలా చోట్ల మాకు ఎమ్మెల్యేలు లేకపోయినా ఆ స్థానాల్లో బీజేపీకి మెజార్టీని ఇచ్చి ప్రజలు బీజేపీ ఎంపీలను గెలిపించారన్నారు. సికింద్రాబాద్ లో వాస్తవంగా పోటీ చేసింది కాంగ్రెస్ కాదని కాంగ్రెస్ గుర్తుపై మజ్లీస్‌ పార్టీ పోటీ చేసిందని ఎంఐఎం బాధ్యత తీసుకుని బీజేపీని ఓడించేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి, బీఆరెస్‌లు ఎంత విష ప్రచారం చేసిన ప్రజలు మోదీ నాయకత్వాన్ని విశ్వసించారన్నారు. అనేక స్థానాల్లో బీఆరెస్ డిపాజిట్లు కోల్పోయిందన్నారు. ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా కేసీఆర్, హరీశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, సిద్దిపేట సెగ్మెంట్‌లు ఉన్న మెదక్‌లోనూ విజయం సాధించామని గుర్తు చేశారు.

ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలో ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న ఏకైక ప్రభుత్వం రేవంత్ సర్కార్ అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉచిత బస్సు ప్రయాణం హమీ మినహా ఏదీ అమలు చేయడం లేదన్నారు. రానున్న రోజుల్లో ప్రజల పక్షాన ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ఒత్తిడి తీసుకువచ్చేలా కార్యచరణ తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో అమిత్ షాపై తప్పుడు కేసు పెట్టారన్నారు. అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి అండగా ఎన్నికల ఫలితాల్లో ఇంకా ఎవైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకుని తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా సమిష్టిగా కలిసి ముందుకు వెళ్తామని తెలిపారు. కేంద్రంలో మూడోసారి ఎన్డీయే, ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంపై హర్షం వ్యక్తం చేశారు.

Related posts