Praja Kshetram
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వం కొలువుదీరకముందే ఏపీలో కీలక నిర్ణయాలు

ప్రభుత్వం కొలువుదీరకముందే ఏపీలో కీలక నిర్ణయాలు

 

*-సెలవుపై వెళ్లిన జవహర్‌రెడ్డి, రావత్‌*

 

*-40 మంది సలహాదారుల తొలగింపు*

 

*-చంద్రబాబును కలిసేందుకు సీనియర్‌ అధికారుల ప్రయత్నం*

 

*-గేటు బయటే ఆపి, తిప్పి పంపిన సిబ్బంది*

 

 

 

 

అమరావతి: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరడానికి ముందే రాష్ట్రంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జగన్‌ ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులై జవహర్‌రెడ్డి, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్‌.ఎస్‌. రావత్‌ సెలవుపై వెళ్లారు. గత ప్రభుత్వంలో నియమితులైన సలహాదారులందరినీ తక్షణమే తొలగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఎన్నికల కోడ్‌కు ముందు 1800 టీచర్లను బదిలీ చేయాలని గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు బ్రేకులు పడ్డాయి. గత ప్రభుత్వ అండదండలతో వివాదాస్పదంగా వ్యవహరించిన ఐపీఎస్‌ అధికారులు చంద్రబాబు కలవడానికి యత్నించారు. వారందరికీ నో ఎంట్రీ అని పోలీసులు అడ్డుకున్నారు. ఇలా కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి ముందే ఏపీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

 

 

*సీఎస్‌ వ్యవహారశైలితోనే సెలవు వెళ్లాలని ఆదేశం*

 

ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డిపై మొదటి నుంచీ విమర్శలున్నాయి. మొన్నటి ఎన్నికల సమయంలోనూ ఆయన అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరించారని విపక్ష టీడీపీ, జనసేన విమర్శించాయి. గత ప్రభుత్వ హయాంలో సీఎం వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. దీనికితోడు కొత్త ప్రభుత్వ ఏర్పాటునకు సంబంధించి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన సెలవుపై వెళ్లాలని ఆదేశాలు జారీ అయినట్టు భావిస్తున్నారు. ఏపీలో కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత జహహర్‌రెడ్డి చంద్రబాబును కలిశారు. రెండు రోజుల్లోనే సెలవుపై వెళ్లడం వెనుక గత ప్రభుత్వ హయాంలో ఆయన వ్యవహారశైలే అంటున్నారు. ఆయన స్థానంలో కొత్త సీఎస్‌ను నియమిస్తారని సమాచారం. ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్‌.ఎస్‌. రావత్‌ కూడా అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్లారు.

 

 

*సలహాదారులందరినీ తొలిగింపు*

 

గత ప్రభుత్వంలో నియమితులైన సలహాదారులలో నిన్నటివరకు కొంత మంది రాజీనామాలు చేశారు. ఇంకా పదవుల్లో కొనసాగుతున్న వారిని కూడా తక్షణమే పదవుల నుంచి తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రానున్న ఒకటి రెండు రోజుల్లో మరికొన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

*వివాదాస్పద అధికారులందరికీ అనుమతి నిరాకరణ*

 

కాబోయే సీఎం చంద్రబాబును కలవడానికి ప్రయత్నించిన వివాదాస్పద ఐపీఎస్‌ అధికారులను పోలీసులు అడ్డుకున్నారు. మర్యాదపూర్వ భేటీ అని చెప్పినా అనుమతి నిరాకరించారు. చంద్రబాబును కలిసేందుకు యత్నించిన వారిలో సీఐడీ చీఫ్‌ సంజయ్‌ని కరకట్ట వద్దనే ఆయన కారును ఆపి వెనక్కి పంపారు. బాబు అక్రమ కేసుల నమోదులో సంజయ్‌ కీలకంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడగానే విదేశాలకు వెళ్లిపోవడానికి సెలవు పెట్టారు. అయితే అదీ కూడా రద్దయినట్టు తెలుస్తోంది.

 

 

ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు గురువారం ఉదయం ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటివద్దకు చేరుకున్నారు. చంద్రబాబును కలిసేందుకు ఆయనకు అనుమతి లభించలేదు. ఎన్నికల విధుల్లో అవకతవలకు పాల్పడ్డారని కేంద్ర ఎన్నికల సంఘం ఆయనను విధుల్లోంచి తప్పించిన విషయం విదితమే. గత ప్రభుత్వ హయాంలో వీళ్లు తమ అధికార పరిధికి మించి, జగన్‌ పట్ల స్వామి భక్తి ప్రదర్శించడానికి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నివాసానికి వెళ్లే మార్గంలో ప్రధాన గేటు వద్దే కానిస్టేబుళ్లు పీఎస్ఆర్ కారును ఆపారు. లోపలికి అనుమతి లేదని స్పష్టం చేయడంతో చేసేదేమీ లేక ఆయన వెనుదిరిగారు.

 

మరో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కొల్లి రఘురామిరెడ్డి చంద్రబాబును కలవడానికి ఫోన్‌లో అధికారులను అనుమతి కోరాగా కుదరదని చెప్పారని తెలిసింది. నంద్యాలలో చంద్రబాను అరెస్టు చేసే సమయంలో రాఘురామిరెడ్డి కీలకం వ్యహరించారు. ఎన్నికల సమయంలో వైసీపీకి విధేయుడుగా ఉన్నారని ఈసీ ఆయనపై వేటు వేసింది. డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించింది. గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్‌ రెడ్డి ఈ పరిస్థితే ఎదురైంది. గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే విమర్శలు ఆయనపై ఉన్నాయి. చంద్రబాబును కలిసేందుకు వెళ్లగా అనుమతి లేదని గేటు వద్దే పోలీసులు ఆయన కారును ఆపారు. దీంతో చేసేది ఏమీ లేక వేణుగోపాల్ రెడ్డి వెనుదిరిగారు.

 

 

*టీచర్ల బదిలీలకు బ్రేక్‌*

 

రాష్ట్రంలో టీచర్ల బదిలీలపై ఎన్నికల కోడ్ కు ముందు ఇచ్చిన ఉత్తర్వులనూ నిలిపివేశారు. ఎలాంటి బదిలీలు చేపట్టవదని డీఈవోలను ఆదేశించారు. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్‌ ఎస్‌. సురేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలకు ముందు 1800 మంది టీచర్లను బదిలీ చేయాలని వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సీఎం పేషీలో కొందరు అధికారుల ఒత్తిడి మేరకు పైరవీలు, సిఫార్సులతో బదిలీలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Related posts