కాంగ్రెస్ ఆరు నెలల పాలన విఫలం.. రేవంత్‌పై ఎర్రోళ్ల శ్రీనివాస్ ధ్వజం
హైదరాబాద్ జూన్ 06 (ప్రజాక్షేత్రం): తెలంగాణలో కాంగ్రెస్ ఆరు నెలల పాలన విఫలమైందని బీఆర్ఎస్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ ధ్వజమెత్తారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల విషయంలో బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్‌కు చేతకాక బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేస్తున్నారు. కొడంగల్‌లో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు తేడా ఉందన్నారు. రేవంత్ రెడ్డికి వచ్చిన ఓట్లలో 24 వేలు బీజేపీకి వెళ్లాయి. సీఎం సొంత జిల్లాలో బీజేపీని గెలిపించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావుకు వచ్చిన ఓట్లు ఎవరికి పడ్డాయి. 18 నుంచి 20 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సీట్లలో ఓట్లు ఎందుకు తగ్గాయి. రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంటే 16 సీట్లు గెలిచేవాళ్లు కదా..? రేవంత్ సిట్టింగ్ సీటు మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ ఓడిపోయింది. ప్రజల తీర్పుని శిరసావహిస్తాం. కాంగ్రెస్ నేతలు ఎందుకంత మిడిసిపడుతున్నారు. బీజేపీకి అవయవదానం చేసింది కాంగ్రెస్ మంత్రులు. ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టాలి అని ఎర్రోళ్ల శ్రీనివాస్ సూచించారు.